SEBI- PAC | పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశానికి సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్ గైర్హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం పీఏసీ సమావేశం జరుగాల్సి ఉంది. దేశంలోని నియంత్రణ సంస్థల పనితీరును సమీక్షించడానికి వీలుగా ఈ నెల 24న పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ సమావేశానికి హాజరు కావాలని సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురి బుచ్కు పీఏసీ సమన్లు జారీ చేసింది. కానీ, ముఖ్యమైన కారణాల వల్ల తాను సమావేశానికి హాజరు కాలేనని పీఏసీకి ఆమె తెలిపారు. దీంతో పీఏసీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.
ఈ విషయమై పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘తొలి కమిటీ సమావేశంలో సెబీ, ఇతర రెగ్యులేటరీ సంస్థల పనితీరును సమీక్షించాలని భావించాం. ఇందుకోసం సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపితే వారు మినహాయింపు కోరారు’ అని చెప్పారు. కానీ వారి అభ్యర్థనను పీఏసీ తిరస్కరించిందని, దీంతో తమ బృందంతో కలిసి సమావేశానికి హాజరవుతామని తెలిపారన్నారు. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఢిల్లీకి వచ్చే పరిస్థితి లేదని సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్ గురువారం ఉదయం 9.30 గంటలకు సమాచారం అందించారన్నారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని సమావేశాన్ని వాయిదా వేశాం అని చెప్పారు. మాధాబీ పురీ బుచ్కు పీఏసీ సమన్లు జారీ పంపడం ఇది రెండోసారి.