CS Shetty | న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విస్తరణ బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కొత్తగా 600 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, రెసిడెన్షియల్ టౌన్‌షిప్పుల్లో కొత్తగా వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 137 శాఖలను ప్రారంభించగా, వీటిలో 59 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పింది. ప్రస్తుతం బ్యాంక్ దేశవ్యాప్తంగా 22,542 శాఖలు, 65వేల ఏటీఎంలు, 85 వేల బిజినెస్ కరస్పాండెంట్లను కలిగివున్నది. బ్యాంక్‌కు 50 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారని, ప్రతి భారతీయుడి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్‌తో అనుబంధంతో ఉన్నవారందరి దృష్టిలో ఉత్తమ బ్యాంక్గాను, అత్యంత విలువైన బ్యాంక్‌గా తీర్చిదిద్దడమే తమ తదుపరి లక్ష్యమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శెట్టి వెల్లడించారు.
డిపాజిట్ల కోసం..
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి బ్యాంక్ త్వరలో వినూత్న పథకాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రికరింగ్ డిపాజిట్, సిప్ కాంబోలో వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. సహజంగా ఎవరూ రిస్క్ ఆస్తుల్లో లేదా స్పెక్యూలేటివ్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకోరు, వీరికి బ్యాంకింగ్ పథకాలు సరైనవని, వీరికోసం నూతన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. వీటితోపాటు డిపాజిట్లను మొబలైజేషన్ చేయడానికి ఇప్పటికే బ్యాంక్ పలు కీలక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎన్నో శాఖలు ఉన్నాయని, వీటిలో డిపాజిట్లకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన సూచించారు.