న్యూఢిల్లీ, జూన్ 6: ప్రభుత్వ రంగ బ్యాం కింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా వార్షిక జీతం గత ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.34.42 లక్షలుగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21)లో బ్యాంక్ మాజీ చైర్మన్ రజ్నీశ్ కుమార్ వేతనంతో పోల్చితే 13.4 శాతం పెరిగింది. అయితే ఎస్బీఐ కంటే అన్ని రకాలుగా చిన్నవైన ఇతర ప్రభుత్వ బ్యాంకుల సారథుల జీతాలతో చూస్తే మాత్రం తక్కువే. 2021-22కుగాను కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్వీ ప్రభాకర్ రూ.36.89 లక్షలు, బీవోబీ ఎండీ, సీఈవో సంజీవ్ చద్దా రూ.40.46 లక్షలు ఎత్తుకోవడం విశేషం. కాగా, 1984లో ప్రొబెషనరీ ఆఫీసర్గా ఎస్బీఐలో చేరిన దినేశ్ ఖారా.. 2020 అక్టోబర్లో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఎస్బీఐ అనుబంధ సంస్థలకు ఎండీగా పనిచేశారు. ఇక గత ఆర్థిక సంవత్సరం దినేశ్ ఖారా బేసిక్ పే రూ.27 లక్షలుగా ఉంటే, డీఏ రూ.7,42,500 లుగా ఉన్నది. ఇన్సెంటీవ్ల రూపంలో మరో రూ.4 లక్షలు అందాయి. 2020-21లో రజ్నీశ్ కుమార్కు మొత్తం రూ.30.34 లక్షల జీతం వచ్చింది. ఇందులో రూ.14.04 లక్షలు రిటైర్మెంట్ కింద లీవ్ ఎన్క్యాష్మెంట్గా ఉన్నది.
ప్రైవేట్ బ్యాంకుల్లో కోట్లలో..
ప్రైవేట్ బ్యాంకుల్లోని చైర్మన్లు, ఎండీ, సీఈవోలు పొందుతున్న వేతనాలతో పోల్చితే ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లు అందుకుంటున్నది చాలా తక్కువగానే ఉన్నది. 2020-21లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగ్దీశన్ జీతం రూ.4.77 కోట్లుగా ఉంటే, యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌధరి వేతనం రూ.6 కోట్లుగా ఉండటం గమనార్హం. అయితే కరోనా దృష్ట్యా ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ భక్షీ ఈ 2020-21కుగాను కేవలం గౌరవ వేతనంగా రూపాయినే తీసుకున్నారు.