హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): జనరిక్ ఫార్మాస్యూటికల్స్, బయోసిమిలర్స్ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ శాండోజ్ గ్లోబల్.. హైదరాబాద్‌లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. స్విట్జర్లాండ్‌కు చెందిన శాండోజ్.. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తమ కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్‌ని అందించనున్నది. కాగా, ఈ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా 1,800లకు పెంచుతామని సంస్థ తెలిపింది. శాండోజ్ కంపెనీ సీఈవో రిచర్డ్ సేనోర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో ప్రగతి భవన్లో సమావేశమైంది.
ఈ సందర్భంగా తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది. అంతేగాకుండా ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తమ అత్యాధునిక రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్‌ను మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపింది. అలాగే రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లాబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
జీవవైవిధ్య నగరం..
హైదరాబాద్ నగరంలో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన శాండోజ్.. ఇక్కడున్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్ సంస్థ నోవార్టీస్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే పరిశోధనలను ఇక్కడ చేస్తున్నామన్నది. ఇప్పటికే తమ సంస్థ వెయ్యికిపైగా మాలిక్యుల్స్ని కలిగి ఉన్నదని, పది బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నదని తెలిపింది. ఇక హైదరాబాద్ కేంద్రం తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుందన్న కంపెనీ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.
లైఫ్ సైన్సెస్ భేష్: కేటీఆర్
హైదరాబాద్ కేంద్రంగా శాండోజ్ గ్లోబల్ తమ గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండటంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. వ్యాపార అనుకూలత, అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్ సైన్సెస్ రంగం ఇక్కడ మరింతగా వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని కనబర్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న భవిష్యత్తు ప్రణాళికలను కంపెనీ ప్రతినిధుల బృందానికి వివరించారు.
‘హైదరాబాద్‌లో క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండటం సంతోషకరం. మేము అభివృద్ధి చేస్తున్న ఫార్మాసిటీ అద్భుతమైన పెట్టుబడులకు గమ్యస్థానం. ఇక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని శాండోజ్ పరిశీలించాలి’
– కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
‘మా కంపెనీ కార్యకలాపాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం.. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహాయ సహకారాలపట్ల ఎంతో సంతృప్తికరంగా ఉన్నాం. ఇందుకు ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు’
– శాండోజ్ గ్లోబల్ ప్రతినిధులు