ముంబై, జనవరి 28: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచబోతుండటం, ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 58 వేల మార్క్‌కి చేరుకున్న 30 షేర్ల ఇండెక్స్ సూచీ 57,119 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి ఇండెక్స్ 76.71 పాయింట్లు తగ్గి 57,200.23 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 8.20 పాయింట్లు తగ్గి 17,101.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. మొత్తంమీద ఈవారంలో జరిగిన నాలుగు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2 వేల పాయింట్ల వరకు నష్టపోయింది.