న్యూఢిల్లీ, మార్చి 12: ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీలో 3.5 శాతం వాటాను విక్రయించనున్నట్టు 1900 దశకం తొలినాళ్లలో అందులో ఇన్వెస్ట్ చేసిన బ్రిటన్ కంపెనీ బ్యాట్ ప్రకటించింది. బ్యాట్ తన సబ్సిడరీ టొబాకో మాన్యుఫాక్చరర్స్ ఇండియా (టీఎంఐ) 43,68,51, 457 ఐటీసీ షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లకు బ్లాక్ ట్రేడ్స్‌లో బుక్బిల్డింగ్ ప్రక్రియ ద్వారా మార్చి 13న విక్రయిస్తామని తెలిపింది. మంగళవారంనాటి ఐటీసీ షేరు ముగింపు ధర రూ.404.25 ప్రకారం 3.5 శాతం వాటాల విలువ రూ. 17,659 కోట్లు ఉంటుంది. రూ. 384-400 శ్రేణిలో షేర్లను అమ్మాలన్నది బ్యాట్ ప్రతిపాదన. ఈ వాటాను విక్రయించిన తర్వాత కూడా ఐటీసీలో బ్యాట్ వద్ద 25.5 శాతం వాటా ఉంటుంది. తాజా డీల్‌తో సమీకరించిన నిధులతో బ్యాట్ లండన్‌లో లిస్టయిన తన షేర్లను బైబ్యాక్ చేయాలని యోచిస్తున్నది. ఇందుకోసం 700 మిలియన్ పౌండ్లు ఖర్చుచేయనుంది.