హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : ఫ్రెంచ్కు చెందిన విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సాఫ్రాన్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో వందేండ్లకుపైగా చరిత్ర ఉన్న సాఫ్రాన్.. హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ప్రపంచస్థాయి ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా మంగళవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సాఫ్రాన్ జనరల్ మేనేజర్ పియరీ ఫెర్నాండెజ్ కొత్త పెట్టుబడులను ప్రతిపాదించారు. నూతనంగా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కేంద్రాన్ని నెలకొల్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. రఫేల్, ఎం 88 ఫైటర్ జెట్ ఇంజిన్ల నిర్వహణ, ఓవర్ హాలింగ్ పనులు ఇక్కడే నిర్వహించడానికి వీలు పడనున్నదన్నారు. తద్వారా వచ్చే ఏడాది చివరి నాటికి కొత్తగా 150 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని, అనంతరం దశలవారీగా మరో 750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానాల ఇంజిన్లకు కీలక విడిభాగాలను తయారు చేస్తున్న సాఫ్రాన్ .. ఇకడి నుంచే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది కూడా. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ఇఫీ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనుకూలతలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్ రెడ్డి 30 వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ సంకల్పమన్నారు.