హైదరాబాద్, 26 నవంబర్ (నమస్తే తెలంగాణ) : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ విమానాల విడిభాగాల తయారీ సంస్థ శాఫ్రాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద లీప్(లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్) ఇంజిన్ మెయింటనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్(ఎంఆర్వో) సదుపాయాన్ని హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చ్యూవల్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే శాఫ్రాన్‌కు చెందిన ఎం88 మిలిటరీ ఇంజిన్ ఎంఆర్ఓకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్ పెట్టుబడిదారులకు విశ్వాస కేంద్రంగా మారిందన్నారు.
పెట్టుబడిదారులను సహ-సృష్టికర్తలుగా అభివర్ణించిన ఆయన, నూతన కార్మిక నియమావళి సహా పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంస్కరణలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వాణిజ్య విమానాల్లో ఉపయోగించే లీప్ ఇంజన్ల కోసం ఉద్దేశించిన ఈ కొత్త సదుపాయం యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో దోహదపడుతుందన్నారు. దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇది భారతదేశంలో లీప్ ఇంజిన్ల మొట్టమొదటి ఎంఆర్వో కాగా, రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభించనున్నదని చెప్పారు. ఇది మన స్థానిక ఎంఎస్ఎంఈలకు, ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పించనుందని చెప్పారు.
శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ సెంటర్‌తో భవిష్యత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ ఖర్చు గణనీయంగా తగ్గనున్నదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణికులకు కూడా లాభం చేకూరనున్నదన్నారు. విమానాల మరమ్మత్తులకోసం సింగపూర్, మలేషియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని, ప్రస్తుతం భారత్‌లోనే విమానాల మరమ్మత్తులు చేయనుండటంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయన్నారు. భారత్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంఆర్వో హబ్‌గా మారనుండటంతో భవిష్యత్తులో భారత్ 15 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు వ్యయాలను తగ్గించిన వారం అవుతామని చెప్పారు.