న్యూఢిల్లీ, మే 12: అంతర్జాతీయ మార్కెట్లో డాలరు విలువ పెరుగుతున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ మరో నూతన కనిష్ఠస్థాయికి పడిపోయింది. గురువారంనాడిక్కడ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరుతో రూపాయి మారకపు విలువ చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 77.63 వద్దకు తగ్గింది. ట్రేడింగ్ చివర్లో కొంతవరకూ కోలుకుని 77.50 వద్ద ముగిసింది. క్రితం రోజుతో పోలిస్తే రూపాయి 25 పైసలు నష్టపోయింది. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకంటే అధికంగా 8.3 శాతానికి పెరగడంతో వడ్డీ రేట్లు మరింత అధికమవుతాయన్న భయాలతో రిస్క్ ఆస్తుల పట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో డాలరు విలువను ప్రతిబింబించే ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్ఠస్థాయి 105 వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో భారత్‌తో సహా పలు వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాట పట్టాయి. అలాగే ఇక్కడ ఈక్విటీ మార్కెట్లు క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి నిధల్ని వెనక్కు తీసుకోవడం, దేశ జీడీపీ తగ్గుతుందన్న అంచనాలు తదితర అంశాలతో కూడా రూపాయి తగ్గుతున్నదని ఫారెక్స్ డీలర్లు చెప్పారు.