ముంబై, జూన్ 29: వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లుగా ఎప్పటికప్పుడు రికార్డు కనిష్ఠాల్ని నమోదుచేస్తున్న రూపాయి బుధవారం 79 స్థాయికి జారిపోయింది. క్రితం రోజు భారీగా 48 పైసలు నష్టపోయిన కరెన్సీ తాజాగా మరో 18 పైసలు కోల్పోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 79.05 చరిత్రాత్మక కనిష్ఠస్థాయిని తాకి, చివరకు 79.03 వద్ద ముగిసింది.
దేశీయ కరెన్సీ ఈ నెలలో ఇప్పటివరకూ 1.97 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ఆరునెలల్లో భారీగా 6.39 శాతం విలువను కోల్పోయింది. డాలర్ బలోపేతంకావడం, అమెరికాలో వడ్డీ రేట్లు మరింత వేగంగా పెరుగుతాయన్న అంచనాలతో రిస్క్ ఆస్తుల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వైదొలగడం వంటి అంశాలతో రూపాయి పడిపోతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. రూపాయిని ప్రభావితం చేసే డాలర్ ఇండెక్స్ 0.13 శాతం పెరిగి 104.64 స్థాయికి చేరింది.