Forex Market | ముంబై, నవంబర్ 4: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనమైంది. సోమవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రుపీ విలువ మరో 4 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేనివిధంగా 84.11 స్థాయికి దిగజారింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు, ముడి చమురు ధరల్లో పెరుగుదల, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు.. రూపాయిని బలహీనపర్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.63 శాతం ఎగిసి 75.02 డాలర్లు పలికింది. మరోవైపు క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఒక్కరోజే విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) రూ.4,329.79 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు.
దిగుమతులు భారం
పడిపోతున్న రూపాయి విలువ.. దేశీయ దిగుమతుల్ని అంతకంతకూ భారం చేస్తున్నది. ముఖ్యంగా క్రూడాయిల్ దిగుమతులు ప్రభావితమవుతుండగా, స్థానిక మార్కెట్లలో పెట్రో ధరలు భగ్గుమనే వీలున్నది. అయితే రుపీ పతనం.. ఐటీ వంటి దేశీయ ఎగుమతి రంగాలకు లాభించనున్నది. అయినప్పటికీ దేశ ఎగుమతుల కంటే దిగుమతుల విలువే ఎక్కువ కాబట్టి.. రూపాయి నష్టాలతో వాణిజ్య లోటు ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తున్నది. పైగా దేశంలో డాలర్ నిల్వలు క్రమేణా క్షీణిస్తున్న నేపథ్యంలో రూపాయి మారకం విలువ ఇలా రికార్డు స్థాయిలకు పడిపోవడం కూడా కలవరపెడుతున్నది. గత నెల రోజుల్లో 20 బిలియన్ డాలర్లకుపైగా ఫారెక్స్ రిజర్వులు హరించుకుపోయిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం అక్టోబర్ 25 నాటికి దేశంలో 684.80 బిలియన్ డాలర్ల నిల్వలున్నాయి.