ముంబై, జూలై 28: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతంకావడంతో రూపాయి ఒక్కసారిగా పతనమైంది. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా 26 పైసలు క్షీణించి, రూ.82.18 వద్ద ముగిసింది. క్రితం రోజు ఇది 81.92 వద్ద నిలిచివుంది.
యూఎస్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)లు వరుసపెట్టి వడ్డీ రేట్లు పెంచడం, అమెరికా ఆర్థిక గణాంకాలు మెరుగ్గా వెలువడటంతో డాలర్ బలపడిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. అలాగే ముడి చమురు ధరలు 84 డాలర్ల స్థాయికి చేరడం కూడా రూపాయిని బలహీనపర్చిందన్నారు. అమెరికా జీడీపీ అంచనాల్ని మించి 2.4 శాతం వృద్ధి చెందడం, నిరుద్యోగ గణాంకాలు తగ్గడంతో మరోదఫా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందన్న అంచనాలు ఏర్పడ్డాయని, దీంతో డాలర్ పటిష్టపడిందని బీఎన్పీ పరిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌధరి చెప్పారు.