ABG Fraud Case | గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఏబీజీ షిప్‌యార్డ్ ఒకప్పుడు ఓడలను నిర్మించే పవర్‌హౌస్. కానీ, ఇప్పుడు దేశంలోకెల్లా అతిపెద్ద బ్యాంక్ ఫ్రాడ్‌గా నిలిచింది. 2020 ఆగస్టు 25న ఎస్బీఐ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. కేసు పూర్వాపరాలు బయటపెట్టింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులతోపాటు మొత్తం 28 బ్యాంకుల కన్సార్టియం వద్ద ఏబీజీ షిప్‌యార్డ్ రుణాలు తీసుకుంది. ఆ రుణాలు ఇతర సంస్థల పేరిట దారి మళ్లించింది. ఈ సంస్థ తీసుకున్న రూ.22,842 కోట్ల రుణాల్లో ఐసీఐసీఐ బ్యాంకుకు ఎక్కువ శఠగోపం పెట్టింది.
కేంద్ర ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ రూ.2,925 కోట్ల మేరకు మోసానికి గురైంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.7,089 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్ రూ.3,634 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.1,228 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.1,228 కోట్ల మేరకు మోసపోయాయి.
2005 నుంచి రుణాలు తీసుకుంటున్న ఏబీజీ షిప్‌యార్డ్.. బకాయిలు చెల్లించకపోవడంతో 2013లో మొండి బకాయిగా బ్యాంకులు నిర్ణయించాయి. కానీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాల్లోని సంస్థ అనుబంధ కంపెనీలకు మళ్లించింది ఏబీజీ షిప్‌యార్డ్. విదేశాల్లోని 38 కంపెనీలను, దేశంలోని మరో 60 సంస్థలను కంపెనీ ఈ వ్యవహారంలో వినియోగించుకుందని తేలింది.
అయినప్పటికీ 2014లో కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ కింద రుణాలను రీస్ట్రక్చర్ చేశాయి బ్యాంకులు. అయినా ప్రయోజనం లేకపోయింది. బకాయిలను ఏబీజీ చెల్లించనేలేదు. బ్యాంకుల కన్సార్టియంకు ఐసీఐసీఐ బ్యాంకు సారధ్యం వహించిన ఫ్రాడ్‌గా గుర్తించిన ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ఈ నెల ఏడో తేదీన కేసు నమోదు చేసిన సీబీఐ.. 15న కంపెనీ ప్రమోటర్ రిషి అగర్వాల్, ఎగ్జిక్యూటివ్‌లు సంథానం ముత్తుస్వామి, అశ్వినీ కుమార్లపై లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో బయటపడ్డ విదేశీ సంస్థల్లో సింగపూర్ కు సంబంధించిన ఒక కంపెనీ వివరాలు ఇంతకుముందే జరిగిన ఫోరెన్సిక్ రికార్డుల్లో బయటపడ్డాయి. మరోవైపు ఏబీజీ షిప్‌యార్డ్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిషి అగర్వాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విదేశాల దర్యాప్తు సంస్థల నుంచి అవసరమైన సమాచారం కోసం సీబీఐ సంప్రదించనున్నట్లు సమాచారం.