OYO | ఓయో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ పేరును ప్రిజంగా మార్చుకుంది. కార్పొరేట్ గుర్తింపులో భాగంగా తమ కంపెనీ పేరును ప్రిజం లైఫ్ ( సంక్షిప్తంగా ప్రిజం)గా మార్చామని ఓయో షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో బోర్డు చైర్మన్, వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ ప్రకటించారు. కాగా, ఓయో పేరు మాత్రం బ్రాండ్‌గా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఐపీవోకు వెళ్లడానికి ముందు ఓయో మాతృసంస్థ తమ పేరును మార్చుకోవడం గమనార్హం.
తమ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రిజం ఒక గొడుగులా పనిచేస్తుందని రితేశ్ అగర్వాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. మేం సమర్థంగా పనిచేయడానికి, మేం ఎవరో స్పష్టంగా తెలియజేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. తమ విభిన్న బ్రాండ్లను ప్రిజం కలుపుతుందని ఆయన వివరించారు. కాగా, ఓయో గ్రూప్ పోర్ట్‌ఫోలియోలో ఓయో, మోటెల్ 6, టౌన్హౌస్, సండే, పాలెట్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. వెకేషన్ హోమ్స్ విభాగంలో బెల్విల్లా, డాన్ సెంటర్, చెక్ మైగెస్ట్, స్టూడియో ప్రెస్టీజ్ వంటి వివిధ బ్రాండ్లు ఉన్నాయి. ఎక్స్టెండెడ్ స్టే విభాగంలో స్టూడియో 6ను నిర్వహిస్తోంది. అమెరికాలో జీ6 హాస్పిటాలిటీ నుంచి కొనుగోలు చేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రిజం గ్రూప్ కింద పనిచేయనున్నాయి.
ఐపీవోకు వెళ్లడానికి ముందు ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ పేరును మార్చాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పేరును సూచించాలని ప్రపంచవ్యాప్తంగా ఒక పోటీని పెట్టింది. ఇందులో ఆరు వేలకుపైగా సూచనలు వచ్చాయి. వాటి మేరకు ప్రిజం పేరును ఎంపిక చేశారు. ఇక ఓయో కంపెనీని రితేశ్ అగర్వాల్ 2012లో స్థాపించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో 100 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తోంది.