Luxury Homes | సకల వసతులతో కూడిన విలాసవంతమైన ఇల్లు విక్రయిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు.. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ `డీఎల్ఎఫ్`.. ఇండ్ల నిర్మాణం చేపట్టక ముందే 865 మిలియన్ డాలర్లకు అన్ని లగ్జరీ అపార్ట్మెంట్లను విక్రయించేసింది. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకున్నది. కేవలం మూడు రోజుల్లో రూ. 7, 200 కోట్ల విలువైన 1,113 లగ్జరీ ఇండ్లు విక్రయించింది. ఈ అపార్ట్మెంట్ నాలుగు బెడ్ రూమ్‌లు, ఒక పెంట్ హౌస్ యూనిట్ కలిగి ఉంటుంది. డీఎల్ఎఫ్ తన ప్రీవణ సౌత్ ప్రాజెక్టుల్లో ఏడు టవర్ల పరిధిలోని ఇండ్లన్నీ విక్రయించినట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో డీఎల్ఎఫ్ వెల్లడించింది.
116 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ శాటిలైట్ సిటీలో ఇండ్లు కొనుగోలు చేసిన వారిలో సెర్చింజన్ గూగుల్, ప్రముఖ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సేవల సంస్థ `అమెరికన్ ఎక్స్‌ప్రెస్` ఉద్యోగులు, ఎన్నారైలు కూడా ఉన్నారు. పలు ప్రపంచ దేశాల్లోనూ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్రజలకు సేవలందిస్తున్నది. ఏడాది కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో డీఎల్ఎఫ్ షేర్లు రెండింతలకు పైగా పెరిగాయి. 2008 నుంచి డీఎల్ఎఫ్ షేర్లు పెరగడం ఇదే గరిష్టం. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో గతేడాది డీఎల్ఎఫ్ షేర్ 18 శాతం పెరిగింది.
ఐదేండ్ల క్రితంతో పోలిస్తే సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగినట్లే విలాసవంతమైన ఇండ్లకూ గిరాకీ ఎక్కువ అవుతున్నది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రీమియం లేదా లగ్జరీ అపార్ట్మెంట్ ప్లాట్లకు గిరాకీ పెరుగుతుండటంతో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో భారీ స్థాయిలో లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. మరి కొన్నేండ్ల పాటు లగ్జరీ ఇండ్ల బూమ్ కొనసాగుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గులాం జియా చెప్పారు. సంపన్నులు మాత్రమే కాకుండా ఎగువ మధ్య తరగతి కుటుంబాలు సైతం విలాసవంతమైన ఇండ్లు కొనుగోలు చేస్తున్నారన్నారు.
మూకుమ్మడిగా ఒక్కటి కంటే ఎక్కువ బుకింగ్స్‌ను నిరుత్సాహ పరిచేలా డీఎల్ఎఫ్ యాజమాన్యం నిబంధనలు ఖరారు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఒక్కో వ్యక్తికి ఒక అపార్ట్ మాత్రమే పరిమితం చేసింది. కానీ ప్రతి కొనుగోలు దారు ఐదు అపార్ట్మెంట్ల చొప్పున బుక్ చేశారని తెలుస్తున్నది. గతేడాది సైతం కేవలం మూడు రోజుల్లో 100 కోట్ల విలువైన 1100 అపార్ట్మెంట్లకు పైగా విక్రయించింది డీఎల్ఎఫ్. మరో రియాల్టీ డెవలపర్ గోద్రేజ్ ప్రాపర్టీస్ సైతం 500 మిలియన్ డాలర్లపై చిలుకు విలువ గల లగ్జరీ ఇండ్లు విక్రయించింది.