న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరల సూచీ మళ్లీ విజృంభించింది. కూరగాయలు, మాంసం, చేపలు, కోడిగుడ్ల ధరలు భగ్గుమనడంతో గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతానికి పైకి ఎగబాకింది. జూలై నెలలో 1.61 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ ఆ మరుసటి నెల ఆగస్టులో 2.07 శాతానికి ఎగబాకినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గడిచిన తొమ్మిది నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరల సూచీ మళ్లీ పుంజుకుంటున్నదని తెలిపింది. నవంబర్ 2024 నుంచి తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 3.65 శాతంతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గింది. గత నెలలో ఆహార ద్రవ్యోల్బణ సూచీ మైనస్ 0.69 శాతంగా నమోదైందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
కూరగాయలు, మాంసం, చేపలు, నూనెలు, కొవ్వు పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, గుడ్లు వంటి ఆహార పదార్థాల ధరలు భగ్గుమనడంతో ధరల సూచీ పెరిగిందని వెల్లడించింది. అయినప్పటికీ రిజర్వు బ్యాంక్ అంచనావేసిన 4 శాతం కంటే తక్కువస్థాయిలోనే నమోదైంది. గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణ సూచీ 1.18 శాతం నుంచి 1.69 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. ఆహార, బెవరేజెస్ విభాగ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లనే గత నెల ధరల సూచీ పెరిగిందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. ఖరీఫ్‌లో పంట విస్తీర్ణం భారీగా పెరిగినప్పటికీ వర్షాలు భారీగా కురియడం, దేశవ్యాప్తంగా వచ్చిన తుఫాన్‌తో పంటలు భారీగా నష్టపోయాయని, దీంతో వీటి ధరలు భారీగా పెరిగాయన్నారు.