Gold Loans | న్యూఢిల్లీ, మార్చి 7 : పసిడి రుణాలకు కళ్లెం వేయడానికి రిజర్వుబ్యాంక్ సిద్ధమవుతున్నది. ఇబ్బడిముబ్బడిగా తీసుకుంటున్న గోల్డ్ లోన్లకు చెక్ పెట్టడానికి త్వరలో కఠిన నిబంధనలను అమలులేకి తేవాలని చూస్తున్నది. ఇందుకు సంబంధించి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు జారీ చేస్తున్న గోల్డ్ లోన్లపై నిఘా పెట్టాలని సూచించింది. గోల్డ్ లోన్ తీసుకున్నవారు ఈ నిధులను దేనికి వినియోగిస్తున్నారు.. అసలు బంగారం వారిదేనన్న దానిపై పూర్తి వివరాలు సేకరించాలని బ్యాంకులకు సూచించింది. గడిచిన ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా బంగారం తాకట్టుపై రుణాలు 50 శాతానికి పైగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన సెంట్రల్ బ్యాంక్.. దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది.
ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లనే రుణాలు అత్యధికంగా తీసుకుంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీసుకున్న రుణాలు వారు దేనికి వినియోగిస్తున్నారన్న విషయంపై మానిటర్ చేయాలని సూచించింది. రుణాలు తీసుకున్నవారి కుటుంబ వివరాలు, పసిడి వారిదేనా లేకపోతే ఇతరవారు వీరిపై తీసుకుంటున్నారా అనేదానిపై సమాచారం సేకరించాలని పేర్కొంది. ఇటీవలకాలంలో తమవద్ద ఉన్న బంగారాన్ని వేరేవారి పేరుమీద తీసుకొని ఇతర పెట్టుబడులు పెడుతున్నారనే సమాచారం ఆధారంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించనియెడల ఈ బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంటుంది.
పసిడి తాకట్టుపై రుణాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో సెంట్రల్ బ్యాంక్ ఆందోళన వ్యక్తంచేసింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు పసిడి రుణాలు 50 శాతం పెరిగాయి. పసిడి వినిమయంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్లో గోల్డ్ లోన్లకు అత్యధిక మంది ఆకర్షితులవుతున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్లపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. గడిచిన 12 నుంచి 16 నెలల మధ్యకాలంలో నాన్-బ్యాంకింగ్ సంస్థలు జారీ చేసిన గోల్డ్ లోన్లపై ఆర్బీఐ ఆడిటింగ్ నిర్వహించగా, దీంట్లో ఎన్నో అనుమానాలు తలెత్తాయని, తీసుకున్నవారిలో సగానికి పైగా మంది వేరే అవసరాలకు వినియోగించారనే అనుమానం వ్యక్తంచేసింది.