హైదరాబాద్, జనవరి 23: ఫ్రెంచ్‌నకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన రెనో..దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇప్పటికే మూడు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న సంస్థ..వచ్చే మూడేండ్లకాలంలో ఐదు సరికొత్త మాడళ్లను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో ఒక్క ఎలక్ట్రిక్ వాహనంతోపాటు మూడు ఎస్‌యూవీలు, సీఎన్జీలు ఉన్నాయని రెనో ఇండియా ఎండీ, సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లి తెలిపారు.
సింగిల్ చార్జింగ్‌తో 300 కిలోమీటర్ల స్థాయిలో ప్రయాణించే ఈవీ మాడల్ ఎప్పటిలోగా విడుదల చేసేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీని ధర రూ.12 లక్షలకు పైగా ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా బ్యాటరీ చార్జింగ్ సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఈ ఏడాది 20 శాతం వృద్ధి
ప్రస్తుత సంవత్సరంలో 20 శాతం వృద్ధి అంచనావేస్తున్నట్లు చెప్పారు. 2023లో దేశీయంగా 49 వేల వాహనాలను విక్రయించినట్లు, ఈ ఏడాది ఈ సంఖ్య 20 శాతం వృద్ధితో 60 వేలకు చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. వీటిలో క్విడ్, కైగర్, ట్రైబర్ అత్యున్నత ఫీచర్స్‌తో రూపొందించినట్లు, ముఖ్యం గా భద్రతకు పెద్దపీట వేసినప్పటికీ ఎలాంటి అదనపు చార్జీలు విధించడం లేదని చెప్పారు. ప్రస్తుతం సంస్థ 1.8 శాతం మార్కె ట్ వాటా కలిగివున్నది. మరోవైపు, దేశవ్యాప్తంగా చిన్న స్థాయి కార్లకు డిమాండ్ అంతకంతకు పడిపోతున్నదని, ఈ సమయంలోనే రూ.10 లక్షల కంటే అధిక ధర కలిగిన మధ్యస్థాయి ఎస్‌యూవీలకు డిమాండ్ అధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 430 అవుట్లెట్లు ఉండగా, వీటిలో తెలంగాణలో 20 అవుట్లెట్లను నిర్వహిస్తున్నది.
మూడు ఈవీలను తీసుకోస్తాం
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)పై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాదిలో దేశీయ మార్కెట్లోకి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. దేశీయ మార్కెట్లోకి మార్విక్ 440 బైకును విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కంపెనీ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్లాంట్ సామర్థ్యాన్ని నెలకు 10 వేల యూనిట్లకు పెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మధ్యస్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు, అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్‌తో కలిసి బైకు విడుదల మరింత ఆలస్యంకావచ్చునని, దేశీయంగా ప్రీమియం బైకులకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు.
మరో 100 నగరాలకు విడా స్కూటర్లు..
ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని విడా స్కూటర్లను మరో 100 నగరాలకు విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. గడిచిన వారంలో మొత్తంగా 100 నగరాల్లో ఈ స్కూటర్లు లభిస్తున్నాయని, వచ్చే ఏడాది చివరినాటికి వీటిని మరో వంద నగరాల్లో విక్రయించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎక్స్‌క్లూజివ్ చిన్న స్టోర్లను సైతం ఏర్పాటు చేసే అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.