Anomaly : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జొనాస్‌కు చెందిన ‘అనోమలి'(Anomaly) బ్రాండ్‌ను రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (Reliance Retail Ltd) హస్తగతం చేసుకుంది. కేశ సంరక్షణకు సంబంధించిన ఈ ఉత్పత్తుల బ్రాండ్ ఆస్తులు, డిజిటల్ హక్కులను రిలయన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని గురువారం రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. అనోమలి బ్రాండ్‌ను సొంతం చేసుకోవడం రిలయన్స్ రిటైల్ సౌందర్య సాధనాల విస్తరణలో కీలకం కానుంది. అంతేకాదు భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లను వినియోగదారులకు అందించాలనే సంకల్పానికి ప్రతీకగా నిలవనుంది.
కేశ సంరక్షణ కోసం అనోమలి బ్రాండ్‌ను 2001లో ప్రియాంక చోప్రా ప్రారంభించారు. శిరోజాల పరిరక్షణకు అద్భుతంగా పనికొచ్చే ఈ బ్రాండ్‌ను పూర్తిగా మొక్కల ఉత్పత్తులతో తయారుచేశారు. పైగా అనోమలి అందుబాటు ధరలో లభిస్తుంది. దాంతో, ఈ బ్రాండ్ అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు జోరుగా సాగాయి. అనోమలిని ఛేజిక్కించుకోవడం ద్వారా రిలయన్స్ రిటైల్స్‌కు పూర్తిగా యాజమాన్య హక్కులు సిద్ధించాయి. మేధో సంపత్తి హక్కులతో పాటు డిజిటల్ మార్కెటింగ్ కూడా రిలయన్స్ వశమైంది. దాంతో.. అనోమలీ ప్రొడక్ట్‌ను తమ సంస్థ కేంద్రాల ద్వారా అమ్మకాలు చేపట్టనుంది రిలయన్స్. ప్రియాంక చోప్రా బ్రాండ్‌ను తీసుకోవడం ద్వారా శరవేగంగా వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత శుభ్రత రంగంలో విస్తరించాలనుకున్న రిలయన్స్ వ్యూహం నెరవేరనుంది. ఇప్పటికే ఉన్న టీరాతో పాటు అనోమలి అమ్మకాలతో కంపెనీ అభివృద్ధితో పాటు వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురానుంది రిలయన్స్.

ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ .. రిలయన్స్ సేవలు, ఉత్పత్తుల్లో అనోమలిని భాగం చేసుకోవడం అనేది ఈ ఆధునిక యుగంలో, విశేష ఆదరణ కలిగిన సౌందర్య ఉత్పత్తుల విస్తరణలో మేము వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు. ఈ బ్రాండ్‌కున్న అంతర్జాతీయ గుర్తింపు, మొక్కల సంబంధిత ఉత్పత్తి కావడం, అందుబాటులో ధరలో లభించడం వంటి వాటితో మా కంపెనీ ఉత్పత్తులకి అదనపు ప్రయోజనం కలగనుంది. ప్రియాంక చోప్రాతో కలిసి అనోమలిని భారత్ వ్యాప్తంగా అమ్మకాలు చేపట్టేందుకు రిలయన్స్ అన్ని విధాల సమర్ధమైన కంపెనీ. మా సంస్థ పనితీరు, వినియోగదారుల అభిరుచులపై అవగాహన.. అంతర్జాతీయంగా రిలయన్స్ ఉత్పత్తుల అమ్మకాలు.. ఇవన్నీ అందుకు దోహదపడుతాయి అని వివరించారు.
భారత్‌లో అనోమలి బ్రాండ్ అమ్మకాలు పెంచడంపై రిలయన్స్ దృష్టి సారించనుంది. కేశ సంరక్షణ, మాడు పరిరక్షణలో భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం అనోమలి ఉత్పత్తి సేల్స్‌లో కీలకం అవుతాయి. ఉత్తర అమెరికా, బ్రిటన్, మధ్య ఆసియాలోనూ రిలయన్స్ ఈ బ్రాండ్ అమ్మకాలను చేపట్టనుంది. అయితే.. ప్రియాంక చోప్రా ఈ బ్రాండ్‌ను మరింత అభివృద్ది చేయడంలో క్రియేటివ్ డైరెక్టర్‌గా, బ్రాండ్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించనుంది. అనోమలి అమ్మకాలు రిలయన్స్ రిటైల్ సాగించడం అనేది నిజంగా గొప్ప విషయం. వ్యక్తిగత ప్రయాణంగా దీన్ని మొదలెట్టాను. కానీ, ఇప్పుడు రిలయన్స్ ఛేజిక్కించుకోవడం అనోమలి పరంగా కొత్త అధ్యాయం. రిలయన్స్ రిటైల్ సంస్థ వినూత్న ఆలోచనలు అనోమలిని భారత్‌తో పాటు ప్రపంచమంతా విస్తరించేలా చేస్తాయి. ఇషా అంబానీతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అని ప్రియాంక తెలిపింది.