Reliance | సౌర విద్యుత్ నుంచి హైడ్రోజన్ తదితర నూతన ఇంధన రంగాల్లో బిజినెస్ ద్వారా కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance) కు వచ్చే ఏడేండ్లలో అంటే 2030 నాటికి 10-15 బిలియన్ డాలర్ల ఆదాయం లభించనున్నది. అయితే, ఆయా రంగాల్లో పరిమితమైన టెక్నాలజీ వనరులు ఉన్న రిలయన్స్.. ఇతర సంస్థలను స్వాధీనం చేసుకోవడం గానీ, ఇతర సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కానీ చేసుకోవాల్సి ఉంటుందని ప్రముఖ అనాలిసిస్ సంస్థ సాన్ఫోర్డ్ సీ బెర్న్‌స్టీన్ నివేదిక తేల్చి చెప్పింది.
భారతదేశంలో 2050 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న రిలయన్స్ కొత్తగా వృద్ధి సాధించడానికి క్లీన్ ఎనర్జీ (సోలార్, బ్యాటరీ, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్ సెల్స్) పునాది కానున్నది. 2030 నాటికి గ్రీన్ హెచ్2 ఎనర్జీ 50 లక్షల టన్నులు, 280 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
2030 నాటికి ఐదు శాతం విద్యుత్ కార్లు, కమర్షియల్ వాహనాలు 21 శాతం టూ వీలర్స్ పెరుగుతాయి. ప్రస్తుతం 10 బిలియన్ డాలర్ల విలువ గల విద్యుత్ అవసరం కాగా, 2030 నాటికి 30 బిలియన్ డాలర్ల విలువ గల విద్యుత్ కావాలని సాన్ ఫోర్డ్ సీ బెర్న్ స్టీన్ పేర్కొన్నది. రెండు లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడుల ద్వారా 2050 నాటికి టోటల్ అడ్రెసబ్బుల్ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఈ బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది.
నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలంటే సోలార్ విద్యుత్ రంగంలో 60 శాతం, బ్యాటరీ ఆధారిత ఇంధన రంగంలో 30 శాతం, హైడ్రోజన్ టోటల్ అడ్రెసబుల్ మార్కెట్ లో 20 శాతం వాటాను రిలయన్స్ సొంతం చేసుకోవాలని అంచనా వేసింది. తమ అంచనా ప్రకారం 2030 నాటికి రిలయన్స్ 40 శాతం మార్కెట్ ద్వారా కొత్త ఇంధన రంగాల్లో 10-15 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదిస్తుందని తెలిపింది.