Reliance | పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. స్టాక్ మార్కెట్ల లీడర్ రిలయన్స్ షేర్ గురువారం దాదాపు నాలుగు శాతం పతనమైంది. తత్ఫలితంగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.77,606.98 కోట్లు హరించుకుపోయింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించడం కూడా దీనికి మరో కారణం.
బీఎస్ఈలో రిలయన్స్ స్టాక్ 3.91 శాతం నష్టపోయి రూ.2,815.25 వద్ద నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 5.28 శాతం వరకూ నష్టపోయి రూ.2775 వరకూ పతనమైంది. మరోవైపు, ఎన్ఎస్ఈలో 3.94 శాతం నష్టపోయి రూ.2,813.95 వరకు పడిపోయింది. ఫలితంగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.77,606.98 కోట్లు కోల్పోయి రూ.19,04,762.79 కోట్లకు పరిమితమైంది. రిలయన్స్ షేర్లు వరుసగా మూడో రోజు పతనం అయ్యాయి. మూడు రోజుల్లో రిలయన్స్ స్టాక్ 7.76 శాతం నష్టపోయింది. ఇక బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,769.19 పాయింట్ల నష్టంతో 82,497.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 1832.27 పాయింట్ల పతనంతో 82,434.02 పాయింట్లకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 546.80 పాయింట్లు కోల్పోయి 25,250.10 పాయింట్ల వద్ద ముగిసింది.