ఐసీఈఏ
న్యూఢిల్లీ, జనవరి 10: మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు.. దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని పెంచగలదని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మహింద్రూ బుధవారం అన్నారు. ఆయా దేశాల నుంచి భారత్కు వస్తున్న మొబైల్ ఫోన్ కంపోనెంట్స్పై ఇంపోర్ట్ డ్యూటీస్కు కోత పెడితే 28 శాతం వృద్ధితో 2027కల్లా స్థానిక ఉత్పత్తి 82 బిలియన్ డాలర్లను తాకవచ్చని అభిప్రాయపడ్డారు.
ఎగుమతులు 39 బిలియన్ డాలర్లకు పెరగడానికీ ఇది దోహదపడగలదన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2022-23) భారతీయ స్మార్ట్ఫోన్ ఎగుమతులు ఏకంగా 100 శాతం ఎగిసి 11.1 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి విదితమే. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 15 బిలియన్ డాలర్లకు వెళ్తాయన్న అంచనాలున్నాయి. ఐసీఈఏలో యాపిల్, ఫాక్స్కాన్, డిక్సాన్, వివో, ఒప్పో, షియామీ, లావా తదితర కంపెనీలకు సభ్యత్వం ఉన్నది తెలిసిందే.