న్యూఢిల్లీ, జూలై 18: ఫార్చ్యూన్ బ్రాండ్ పేరిట వంటనూనెల్ని విక్రయించే అదానీ విల్మర్ ధరల్ని తగ్గించింది. అంతర్జాతీయంగా ధరల దిగిరావడంతో దేశీయంగా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు మళ్లిస్తున్నామని, కొత్త ఎమ్మార్పీ (గరిష్ఠ రిటైల్ ధర) కూడిన వంటనూనెల స్టాక్ త్వరలో మార్కెట్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. కంపెనీ విడుదల చేసిన సమాచారం ప్రకారం అన్నింటికంటే అధికంగా సోయాబీన్ ఆయిల్ ధర లీటరుకు ఎంఆర్పీ రూ.195 నుంచి రూ. 165కి తగ్గుతుంది.
చాలావరకూ వంటనూనెలు ఎంఆర్పీకంటే తక్కువగానే మార్కెట్లో విక్రయిస్తున్న నేపథ్యంలో ఇది రూ.155కు వినియోగదారులకు లభిస్తుందని అదానీ విల్మర్ ఎండీ, సీఈవో అంఘసు మాలిక్ తెలిపారు. పొద్దు తిరుగుడు నూనె ధర రూ.210 నుంచి రూ.199కి, రైస్‌బ్రాన్ ఆయిల్ ధర రూ.225 నుంచి రూ. 210కి తగ్గింది. పల్లీ నూనె ధర రూ.220 నుంచి రూ.210కి దిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ టన్ను ధర 400-450 డాలర్ల మేర తగ్గిందని, దాంతో ఇక్కడ లీటర్ పామోలిన్ నూనె ధర రూ. 170 నుంచి రూ.144కు సవరించినట్టు అదానీ ఎండీ తెలిపారు.