హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగానికి, నిర్మాణ రంగ ప్రాజెక్టులకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ-రెరా) భారీ ఊరటనిచ్చింది. గల్ఫ్ వార్, దాని పరిణామాల నేపథ్యంలో శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రి త్వ శాఖ ఇచ్చిన సలహాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో నమోదిత రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పూర్తయ్యే తేదీ, రిజిస్ట్రేషన్ చెల్లుబాటు వ్యవధిని 4 నెలల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నుంచి నవంబర్ 30కి పెంచింది. ఈ వెసులుబాటు పొందేందుకు బిల్డర్లు/డెవలపర్లు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అదనపు ఫీజు కూడా అక్కర్లేదు.