Shaktikanta Das | ఇష్టారాజ్యంగా రుణాలిస్తూ.. రుణ గ్రహీతల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న డిజిటల్ రుణ దాతల ఆట కట్టించడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సిద్ధమైంది. డిజిటల్ లెండింగ్ను నియంత్రించడానికి త్వరలో మార్గదర్శకాలను అమల్లోకి తేనున్నట్లు ముంబైలో శుక్రవారం జరిగిన ఓ చర్చాగోష్టిలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. రుణ బకాయిలను వసూలు చేయడానికి రుణ గ్రహీతలతో రెగ్యులేటెడ్, నాన్ రెగ్యులేట్ లోన్ రికవరీ ఏజంట్ల అనుచిత ప్రవర్తనను ఖండించారు.
డిజిటల్ లెండింగ్పై ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ సిఫారసుల పరిశీలన చాలా అధునాతన దశలో ఉన్నాయి. చాలా త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తాం అని శక్తికాంత దాస్ తెలిపారు. డిజిటల్ లెండింగ్ యాప్స్, వాటి నియంత్రణకు విధించాల్సిన మార్గదర్శకాల అధ్యయనానికి గతేడాది జనవరిలో ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది.
సరైన పద్ధతుల్లో తనిఖీలు, నియంత్రణల్లేకుండా కొన్ని రుణ దాతలు రుణాల రికవరీ ఏజెంట్లతో కఠినమైన పద్ధతులు అవలంభిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని శక్తికాంత దాస్ చెప్పారు. రికవరీ ఏజంట్లు అర్ధరాత్రి పొద్దు పోయిన తర్వాత తమను సంప్రదించారని రుణ గ్రహీతలు ఫిర్యాదు చేశారన్నారు. ఇటువంటి రికవరీ ఏజంట్ల చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. లేని పక్షంలో పలుకుబడి దెబ్బ తింటుందని హెచ్చరించారు. డిజిటల్ లెండింగ్పై మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు బ్యాంకులు, షాడో లెండర్లతో ఆర్బీఐ సంప్రదిస్తున్నదన్నారు.