NBFC’s Credit Cards | క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేయడానికి బ్యాంకేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు తమ ఆమోదం పొందాల్సి ఉంటుందని ఆర్బీఐ గురువారం స్పష్టం చేసింది. రూ.100 కోట్ల నికర నిధులు గల ఏ ఆర్థిక సంస్థ అయినా క్రెడిట్ కార్డు బిజినెస్‌లోకి ఎంటరయ్యేందుకు ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఆర్థిక సంస్థలకు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అవసరం అని పేర్కొంది.
సరైన ఆమోదం పొందకుండా ఎన్బీఎఫ్సీలు డెబిట్ కార్డులు గానీ, క్రెడిట్ కార్డులు గానీ, చార్జి కార్డులు గానీ, ఇతర ఉత్పత్తులు వర్చువల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ జారీ చేయరాదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తమ స్పాన్సర్ లేదా ఇతర బ్యాంకుల సహకారంతో క్రెడిట్ కార్డులు జారీ చేయొచ్చునని పేర్కొంది. కోర్ బ్యాంకింగ్ సిస్టంతోపాటు కనీసం రూ.100 కోట్ల నిధులు కలిగి ఉన్న షెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు కొన్ని షరతులకు లోబడి క్రెడిట్ కార్డులు జారీ చేయొచ్చునన్నది.
కార్డు దారుల అనుమతి లేకుండా ఏకపక్షంగా వారి క్రెడిట్ కార్డుల అప్‌గ్రేడేషన్, లిమిట్ పెంచడం వంటి చర్యలు చేపట్టొద్దని ఆర్బీఐ హెచ్చరించింది. థర్డ్ పార్టీ ఏజెన్సీల సాయంతో రుణ వసూళ్లకు దిగినప్పుడు ఏజంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎటువంటి వేధింపులకు గురి చేయొద్దని హెచ్చరించింది.
క్రెడిట్ కార్డు జారీ చేస్తున్న సంస్థలు వడ్డీరేటు ఖరారు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆర్బీఐ సూచించింది. రిటైల్ కొనుగోళ్లు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, క్యాష్ అడ్వాన్స్, గడువులోపు కనీస మొత్తం చెల్లింపులో వైఫల్యం, ఆలస్యపు చెల్లింపులకు పాల్పడిన వారికి వార్షిక వడ్డీరేట్లను అమలు చేయాలని ఆర్థిక సంస్థలకు సూచించింది.