RBI Retail Direct | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021 నవంబర్‌లో పరిచయం చేసిన పథకమే రిటైల్ డైరెక్ట్ స్కీం. నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకు వ్యక్తులు/రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇదో వన్-స్టాప్ సొల్యూషన్‌గా వచ్చింది. అంతకుముందు ఈ పెట్టుబడి సౌకర్యం సంస్థాగత మదుపరులకే ఉండేది. అప్పట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్లు కొనాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్బీఐ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉండే రిటైల్ డైరెక్ట్ స్కీం ద్వారా స్వల్ప, దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్లు కొనవచ్చు. పెట్టుబడుల కాలపరిమితుల ఆధారంగా రాబడులుంటాయి. అయితే ఈ స్కీం ద్వారా పొందే వడ్డీ ఆదాయానికి పన్నులు వర్తిస్తాయి. ఈ స్కీం కోసం బ్యాంకులు లేదా ఆర్బీఐ ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కింద 4 రకాల ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చు. అవి.. ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ-సెక్) తేదీతో కూడిన కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ కూపన్ వడ్డీరేట్లను కలిగి ఉంటాయి. 6 నెలల ప్రాతిపదికన ముఖ విలువ ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి. సాధారణంగా వీటి కాలపరిమితి 5 ఏండ్ల నుంచి 40 ఏండ్లదాకా ఉంటుంది. ప్రారంభ పెట్టుబడి రూ.10,000.
కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల మాదిరిగానే నిధుల అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్కెట్ నుంచి రుణాలను సమీకరిస్తుంది. వీటినే రాష్ట్ర అభివృద్ధి రుణాలుగా పిలుస్తారు. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.10,000. గరిష్ఠ కాలపరిమితి పదేండ్లు.
ట్రెజరీ బిల్లులు లేదా టీ-బిల్స్ అనేవి.. మనీ మార్కెట్ సాధనాలు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే స్వల్పకాలిక రుణ సాధనాలుగా కూడా పరిగణిస్తారు. ఇందులో కనీస పెట్టుబడి రూ.25,000. 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల కాలపరిమితిని కలిగి ఉంటాయి.
గ్రాముల చొప్పున బంగారం లెక్కన ఉండేవే ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు. వీటిని భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయ పెట్టుబడిగా చూడవచ్చు. నగదు రూపంలో ఇష్యూ ధరను ఇన్వెస్టర్లు చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో తిరిగి నగదు రూపంలోనే అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తరఫున వీటిని ఆర్బీఐ జారీ చేస్తుంది. కనీస పెట్టుబడి 1 గ్రాము బంగారం. గరిష్ఠం 4 కిలోలు. పెట్టుబడి కాలపరిమితి 8 ఏండ్లు. అయితే ఐదేండ్ల తర్వాత ఎ ప్పుడైనా తీసుకోవచ్చు.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీం కింద, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడానికి రిటైల్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్డీజీ) అకౌంట్‌ను ఇండివీడ్యువల్ ఇన్వెస్టర్లు తెరవాల్సి ఉంటుంది. ఇది కూడా డీమ్యాట్ ఖాతా తరహాలోనే ఉంటుంది. భారత పౌరులతోపాటు ప్రవాస భారతీయులూ (ఎన్నారై) ఖాతాను తెరవవచ్చు. అయితే ఎన్నారైలు విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) నియంత్రణలో ఉంటారు. అలాగే ఎస్‌జీబీల్లో పెట్టుబడులు పెట్టలేరు.