RBI Report | బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పర్సనల్ లోన్స్ లభ్యతలో భారీ పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది జూలై చివరి నాటికి 14.4శాతానికి పెరిగి.. రూ.55.3లక్షల కోట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఆహారేతర రుణాల్లో వ్యక్తిగత రుణాల వాటా అత్యధికంగా 32.9శాతంగా ఉన్నది. ఆ తర్వాత సర్వీసెస్ వాటా 27.4శాతం, ఇండస్ట్రీస్ 22.2శాతం, వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాల వాటా 12.8శాతంగా ఉన్నది. ఇక క్రెడిట్‌కార్డుల బకాయిలు జూలై చివరి నాటికి భారీగా పెరిగాయి. అయితే, బ్యాంకుల మొత్తం రుణాల్లో వీటి వాటా కేవలం ఒకశాతం మాత్రమే. వార్షిక ప్రాతిపదికన 22శాతం వృద్ధితో రూ.2.8లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. అలాగే బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలు ఏకంగా 39శాతం పెరిగాయి. అయితే, మొత్తం వ్యక్తిగత రుణాల వాటాలో 0.8శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే, జనం ఎక్కువగా గంటల వ్యవధిలో లభించే రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా నివేదిక పేర్కొంది.
వాస్తవానికి బంగారంపై రుణం వెంటనే అందుబాటులో ఉంటుంది. వడ్డీ దాదాపుగా వ్యక్తిగత రుణానికి సమానంగానే లభిస్తుంది. నివేదిక ప్రకారం, బలహీనమైన వృద్ధి ఉన్నప్పటికీ వ్యవసాయం.. సంబంధిత కార్యకలాపాలకు ఇచ్చిన రుణాలు 18.1 శాతం పెరిగాయి. మొత్తం రుణాలు రూ.21.6 లక్షల కోట్లకు చేరాయి. పరిశ్రమలకు ఇచ్చే రుణాలు 13.7శాతం పెరిగాయి. హౌసింగ్ లోన్స్ డిమాండ్ అతి తక్కువగా ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ కాలంలో వృద్ధి 12.8శాతం మాత్రమే పెరిగింది. గృహ రుణాల మొత్తం పరిమాణం ఇప్పుడు రూ.28లక్షల కోట్లు దాటింది. ఇటీవలి కాలంలో టాప్-8 నగరాల్లోని ఇండ్ల ధరలు విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అమ్మకాలు బాగానే ఉంటున్నా.. గృహ రుణాలకు డిమాండ్ రేటు తక్కువగానే ఉందని నివేదిక పేర్కొంది.