వేసవి కాలం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసిన పుచ్చకాయలు విరివిగా దొరుకుతుంటాయి. రుచితో పాటు చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా హైబీపీ విషయంలో బాగా పని చేస్తుందట. అదేలాగో తెలుసుకుందాం.
రక్తనాళాల గోడలపై రక్తం కలిగించే పీడనం నిరంతరం ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అంటారు. 140/90 కన్నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే అప్పుడు హైబీపీ ఉందని చెబుతారు. 180/90 బీపీ ఉంటే అప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రాణాంతక పరిస్థితికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే హైబీపీ రాకుండా చూసుకునేందుకు మనం నిత్యం తీసుకునే ఆహారం పరంగా నియమాలు పాటించాలి. అప్పుడే బీపీ కంట్రోల్ అవుతుంది. అయితే ఆహారం విషయానికి వస్తే బీపీని కంట్రోల్ చేసేందుకు మనకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పుచ్చకాయ కూడా ఒకటి.
పుచ్చకాయలు మనకు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల హైబీపీ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అమెరికన్ జనరల్ ఆఫ్ హైపర్ టెన్షన్ లో సైంటిస్టులు చేపట్టిన ఆ అధ్యయనాలకు చెందిన వివరాలను కూడా ప్రచురించారు. ఆ వివరాల ప్రకారం… పుచ్చకాయల్లో ఉండే పలు ఔషధ గుణాలు హైబీపీని తగ్గిస్తాయట. ముఖ్యంగా వాటిలో ఉండే పలు యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలను వెడల్పుగా చేస్తాయట. దీంతోపాటు రక్తపోటును కూడా నియంత్రిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలు తినడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చనివారు చెబుతున్నారు..!