ముంబై, అక్టోబర్ 27: రిజర్వు బ్యాంక్ తన తదుపరి పరపతి ద్రవ్య సమీక్ష(ఎంపీసీ) సమావేశాన్ని వచ్చే నెల 3న అత్యవసరంగా నిర్వహించబోతున్నది. వరుసగా మూడు త్రైమాసికాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో సెంట్రల్ బ్యాంక్ విఫలంకావడంతో ఈ సారి సమావేశాల్లో ప్రధానంగా ఈ అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తున్నది. ద్రవ్యోల్బణాన్ని 4-6 శాతం లోపు కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చట్టం ప్రకారం సెక్షన్ 45జెడ్ఎన్కు లోబడి వచ్చే నెల 3న ఎంపీసీ అదనపు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
గత నెల 28 నుంచి 30 వరకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సెంట్రల్ బ్యాంక్..ఆ మరుసటి నెలలో మరోసారి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఇప్పటికే వడ్డీరేట్లను భారీగా పెంచిన ఆర్బీఐ..మరోదఫా వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. షెడ్యుల్డ్ ప్రకారం డిసెంబర్ 5-7 తేదిల్లో పరపతి సమీక్ష సమావేశం కావాల్సి ఉండగా..నెల రోజులు ముందుగానే భేటీ కావడం విశేషం. సెప్టెంబర్ నెలకుగాను రిటైల్ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. గత నెల సమీక్షలో రెపో రేటును అర శాతం పెంచడంతో రేటు 5.90 శాతానికి చేరుకున్నది.
ఫెడ్ సమావేశం వల్లనే..
అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే నెల 1 నుంచి 2 వరకు రెండు రోజుల పాటు సమీక్ష సమావేశం నిర్వహిస్తుండటం వల్లనే రిజర్వు బ్యాంక్ ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఫెడరల్ రిజర్వు వరుసగా వడ్డీరేట్లను పెంచుతుండటంతో ఇతర దేశాల సెంట్రల్ బ్యాంక్లు కూడా తమ వడ్డీరేట్లను పెంచక తప్పడం లేదు. దీంతో గడిచిన రెండు సమీక్షలోనూ ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచిన విషయం తెలిసిందే.