Sanjay Malhotra | రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకమయ్యారు. ఆయన మూడేళ్లు ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుతం గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగియనున్నది. ఈ క్రమంలో కొత్త గవర్నర్‌ను నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుత గవర్నర్ దాస్ పదవీకాలం డిసెంబర్ 10తో ముగియనున్నది. ఆయన ఐదేళ్ల గరిష్ఠ స్థాయి కంటే ఎక్కువకాలం ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగారు. బెనెగల్ రామారావు తర్వాత ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారు. 2018 డిసెంబర్లో ఆర్బీఐ 25వ గవర్నర్ శక్తికాంత దాస్ నియామకమయ్యారు. 2021లో మళ్లీ మూడేళ్ల పాటు కేంద్రం కొనసాగించింది. 2018, డిసెంబర్ 12న ఉర్జిత్ పటేల్ తర్వాత ఆయన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తమిళనాడు కేడర్‌కు చెందిన రిటైర్డ్ 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ శాఖతో పాటు పలు విభాగాల్లో కార్యదర్శిగా సేవలందించారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీల్లో గవర్నర్‌గా కొనసాగారు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు), ప్రత్యేక కమిషనర్ (రెవెన్యూ), కార్యదర్శి (రెవెన్యూ)గా సేవలందించారు. భువనేశ్వర్‌లో జన్మించిన దాస్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో హిస్టరీలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. శక్తికాంత దాస్ ఇటీవల 2024లో గ్లోబల్ ఫైనాన్స్.. టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఇక కొత్త ఆర్బీఐ గవర్నర్‌గా నియామకమైన సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకం డిసెంబర్ 11 నుంచి అమలులోకి వస్తుంది.
సంజయ్ మల్హోత్రాకు ఫైనాన్స్, టాక్సేషన్, పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ తదితర కీలక రంగాలలో 33 ఏళ్ల అనుభవం ఉంది. మల్హోత్రా 11న బాధ్యతలు స్వీకరిస్తారని కేబినెట్ నియామకాల కమిటీ నోటిఫికేషన్లో తెలిపింది. ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి మందగమనం తదితర సవాళ్ల మధ్య ఆయన నియామకం కీలకంగా మారింది. మల్హోత్రా ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు ఆర్థికశాఖలో కార్యదర్శిగా సేవలందించారు.