RBI on Rupay Forex Cards | ఫారెక్స్ రూపే కార్డుల జారీపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశాల్లో నివసిస్తున్న, ప్రయాణిస్తున్న భారతీయులకు అదనపు చెల్లింపుల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకించి విదేశాల్లో ప్రయాణిస్తున్న భారతీయుల సౌలభ్యం కోసం రూపే-ఫారెక్స్ డెబిట్ కార్డుల జారీ చేయడానికి బ్యాంకులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్), ఆన్ లైన్ చెల్లింపులకు వీలుగా రూపే ఫారెక్స్ డెబిట్ కార్డులు జారీ చేయాలని బ్యాంకులకు తెలిపింది.
ఇప్పటికే భారత్ బ్యాంకులు విదేశాల్లో జారీ చేస్తున్న రూపే-డెబిట్, రూపే-క్రెడిట్ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదం లభిస్తున్నది. గ్లోబల్ పార్టనర్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ కార్డ్ స్కీమ్ సంస్థలతో కో-బ్రాండెడ్ సర్దుబాట్ల ద్వారా, వివిధ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా రూపే -డెబిట్ లేదా రూపే- క్రెడిట్ కార్డులకు అంతర్జాతీయ ఆమోదం లభిస్తున్నది. ఈ సక్సెస్ నేపథ్యంలో విదేశీ ప్రయాణానికి వెళ్లే భారతీయులకు రూపే-ఫారెక్స్ డెబిట్ కార్డులు జారీ చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.
ఇటీవలే విదేశాల్లో వాడుకునేందుకు వీలుగా భారతీయులకు రూపే-డెబిట్, రూపే- క్రెడిట్, ప్రీ-పెయిడ్ కార్డులను జారీ చేసేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూపే కార్డులకు ఆమోదం పెరుగుతున్నందున వాటి సేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇందుకోసం విడిగా సర్క్యులర్ జారీ చేస్తామని వెల్లడించింది.
బ్యాంకింగేతర ప్రీపెయిడ్ కార్డుల జారీ సంస్థలు కూడా ఇక నుంచి ఈ-రూపీ ఓచర్లు జారీ చేయడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ-రూపీ జారీ, రీడెమ్షన్ మరింత తేలిక చేస్తూ వ్యక్తుల తరఫున జారీ చేయడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ-రూపీ ఓచర్ల ప్రయోజనాలను మరింత ఎక్కువ మంది చేర్చడానికి ఈ చర్య ఉపకరిస్తుందని, డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో కలిసి దేశంలో 11 బ్యాంకులు మాత్రమే ఈ-రూపీ జారీ చేస్తున్నాయి.