ముంబై, డిసెంబర్ 5 : గృహ, వాహన, ఇతర రుణగ్రహీతలకు శుభవార్త. ఆయా లోన్ల ఈఎంఐలు తగ్గనున్నాయి మరి. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. రెపోరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తున్నట్టు శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. 5.25 శాతంగా నిర్ణయించారు. మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేటు తగ్గింపునకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నిజానికి అంతకుముందు ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిపిన ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లని సంగతి విదితమే. కానీ సెంట్రల్ బ్యాంక్ ఈసారి మాత్రం తీపికబురును చెప్పింది. ఈ క్రమంలో తమ రుణాలపై వడ్డీరేట్లను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ మేరకు సవరించే వీలున్నది. ఫలితంగా రెపో ఆధారిత ప్రస్తుత, కొత్త రుణాలు చౌక కానున్నాయి. వీటికి చెల్లించే నెలవారీ వాయిదా (ఈఎంఐ)లు దిగిరానున్నాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో నిర్వహించిన ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును ఆర్బీఐ 1 శాతం (100 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. తాజా నిర్ణయంతో ఇది 1.25 శాతానికి (125 బేసిస్ పాయింట్లు) చేరింది. నిజానికి గత ఏడాది వరకు అప్పటి గవర్నర్ శక్తికాంత దాస్.. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వడ్డీరేట్లను పెంచి, గరిష్ఠ స్థాయిల్లోనే ఉంచిన సంగతి విదితమే. అయితే మల్హోత్రా మాత్రం వృద్ధిరేటు ప్రగతే ధ్యేయంగా వడ్డీరేట్లకు కత్తెర వేస్తున్నారు. ఈ ఏడాది వడ్డీరేట్లు తగ్గడం ఇది నాల్గోసారి. మున్ముందు మరింతగా వడ్డీరేట్లు తగ్గుతాయన్న సంకేతాలనూ తాజా సమీక్ష సందర్భంగా ఆయన ఇవ్వడం గమనార్హం. ఇకపైనా న్యూట్రల్ పాలసీనే కొనసాగిస్తామని మల్హోత్రా చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తమ దేశంలోకి వచ్చే భారతీయ వస్తూత్పత్తుల దిగుమతులపై ఏకంగా 50 శాతం సుంకాలను విధించినది తెలిసిందే. ఈ నిర్ణయం అసలే ఇబ్బందుల్లో ఉన్న దేశీయ ఎగుమతులను ఇంకా ప్రభావితం చేసింది. ఓవైపు వాణిజ్య లోటు పెరిగిపోతుండటం, మరోవైపు డాలర్ ముందు రూపాయి విలువ బలహీనపడుతున్న నేపథ్యంలో వడ్డీరేట్ల కోతతో మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చే ప్రయత్నం చేసింది ఆర్బీఐ. ఇప్పటికే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలతో మార్కెట్లో జోష్ ఉందని, దాన్ని కొనసాగించడానికి తమ ఈ నిర్ణయం దోహదం చేయగలదన్న అభిప్రాయాన్ని మీడియా సమావేశంలో ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటిస్తూ మల్హోత్రా వ్యక్తం చేశారు.
రెపోరేటును తాము తగ్గిస్తున్నా.. ఆ మేరకు బ్యాంకులు ఆ ప్రయోజనాలను రుణగ్రహీతలకు ఇవ్వడం లేదని ఆర్బీఐ ఎప్పట్నుంచో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది విదితమే. ఈ నేపథ్యంలోనే ఈసారి బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తాయా? లేదా? అన్నదానిపై గట్టిగా దృష్టి పెడుతామని గవర్నర్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. కాగా, రుణాలపై తీసుకునే వడ్డీరేట్లను బ్యాంకులు తగ్గిస్తే.. డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లనూ తగ్గించే వీలుందన్నారు.
వ్యవస్థలో సరిపడా ద్రవ్యలభ్యత ఉండేలా లక్ష కోట్ల రూపాయలదాకా ఆర్బీఐ పంపింగ్ చేయనున్నది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా రెండు విడుతల్లో నగదు నిల్వలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 11న రూ.50వేల కోట్లు, 18న మరో రూ.50వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొంటామని ప్రకటించింది. అంతేగాక ఈ నెల 16న డాలర్-రూపీ క్రయవిక్రయాల మార్పిడి ద్వారా 5 బిలియన్ డాలర్లను బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తెస్తామని కూడా చెప్పింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)లు తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. రెపోరేటుకు ఆర్బీఐ కోత పెట్టిన నేపథ్యంలో రెపో ఆధారిత రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు బ్యాంకులు వెల్లడించాయి. దీంతో బరోడా రెపో బేస్డ్ లెండింగ్ రేటు (బీఆర్ఎల్ఎల్ఆర్) 8.15 శాతం నుంచి 7.90 శాతానికి దిగింది. కొత్త వడ్డీరేట్లు శనివారం నుంచి అమల్లోకి వస్తాయన్నది. ఇక బీవోఐ రెపో బేస్డ్ లెండింగ్ రేటు (ఆర్బీఎల్ఆర్) 8.35 శాతం నుంచి 8.10 శాతానికి దిగొచ్చింది. ఫలితంగా ఈ బ్యాంకుల్లో గృహ, వాహన తదితర రుణాల వడ్డీ భారం తగ్గనున్నది.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠాలకు పడిపోతున్న వేళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. రూపాయి పతనంలో జోక్యం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఓ టార్గెట్ అంటూ ఏమీ లేదన్నారు. ఈ క్రమంలోనే దాని సరైన స్థాయిని అదే చూసుకునేందుకు కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తున్నామనీ చెప్పారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం తొలిసారి 90 మార్కును అధిగమించి 90.15 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. గురువారం ట్రేడింగ్లోనైతే ఒకానొక దశలో 90.43 స్థాయినీ తాకింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ జోక్యం చేసుకుంటే రూపీ నష్టాలు తగ్గుముఖం పడుతాయన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి. దీంతోనే ఆర్బీఐ బాస్ పైవిధంగా స్పందించారు. అయితే అసాధారణ స్థాయిలో రూపాయి నష్టపోతే ఆర్బీఐ ఎల్లప్పుడూ కలుగజేసుకుని పరిస్థితుల్ని చక్కదిద్దుతుందని చెప్పారు. ఇదిలావుంటే ధరల పెరుగుదల ఆమోదయోగ్యంగా ఉండి, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నంతవరకు వడ్డీరేట్లు తక్కువగానే ఉంటాయని మల్హోత్రా అన్నారు.
వడ్డీరేట్లను తగ్గిస్తూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో ఉత్సాహాన్నినింపింది. ప్రారంభం నుంచి లాభాలబాట పట్టిన సూచీలు చివరివరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. బ్యాంకింగ్, వాహన, రియల్టీ రంగ షేర్లు కదంతొక్కాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరికి 447.05 పాయింట్లు అందుకొని 85,712.37 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 152.70 పాయింట్లు ఎగబాకి 26,186.45 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ లాభపడగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ నష్టాల్లోకి జారుకున్నది. రంగాలవారీగా ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, మెటల్, టెక్నాలజీ షేర్లు అధికమవగా.. సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నష్టపోయాయి.
వడ్డీరేట్లకు సంబంధించిన షేర్లలో భారీ ర్యాలీ నెలకొన్నది. ఎస్బీఐ 2.46 శాతం, బీవోబీ 1.56 శాతం, ఐడీఎఫ్సీ 1.18 శాతం చొప్పున లాభపడ్డాయి. కొటక్ , ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఫెడరల్, యాక్సిస్ బ్యాంక్‌ల షేర్లకు మదుపరుల మద్దతు లభించింది. ఆటో షేర్లలో మారుతి, ఐషర్, మహీంద్రా, టీవీఎస్, బజాజ్, హీరో షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. రియల్టీ షేర్లూ పెరిగాయి.
ఆర్బీఐ రెపోరేటును తగ్గించడం వల్ల పరిశ్రమ, వినియోగదారులపై రుణ భారం దిగుతుంది. అంతేగాక దేశ ఆర్థిక వృద్ధికీ ఈ నిర్ణయం దోహదం చేయగలదు.
రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం దేశంలో రుణ లభ్యతను పెంచి, పారిశ్రామిక విస్తరణకు ఊతమివ్వగలదు. ఆయా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలనూ పెంపొందించగలదు.
గృహ కొనుగోలుదారులకు ఇది తీపి కబురు. ముఖ్యంగా మధ్యతరగతి కస్టమర్లకు పెద్ద ఊరట. వడ్డీరేట్ల తగ్గింపుతో దేశంలో ఇండ్ల అమ్మకాలు పెరుగుతాయి.
వడ్డీరేట్లు తగ్గితే గృహ రుణాలు చౌకగా మారుతాయి. మరింత ఎక్కువమంది హోమ్ లోన్ల ఆధారంగా ఇండ్లు, ఫ్లాట్లు, స్థలాలను కొనుగోలు చేస్తారు.
తక్కువ వడ్డీకే గృహ రుణాలు లభించనుండటంతో గృహ విక్రయాలు ఊపందుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్లోకి నిధుల ప్రవాహం పెంచనుండటం కూడా కొనుగోళ్లలో జోష్ పెంచనున్నది.