న్యూఢిల్లీ, మే 6: దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలకు వరుస కత్తెర్లు పడుతున్నాయి. ఇటీవలే ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ.. తమ గత అంచనాలను సవరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా అదే బాటలో నడిచింది. ఈ సంవత్సరం (2025) భారత జీడీపీ వృద్ధిరేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం మూడీస్ రేటింగ్స్ అభిప్రాయపడింది. మునుపు ఇది 6.5 శాతంగా ఉండటం గమనార్హం. ఇక ఎస్అండ్పీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ వృద్ధిరేటును 6.3 శాతానికి కుదించింది. మునుపు 6.5 శాతంగా అంచనా వేసిన సంగతి విదితమే.
అమెరికా దెబ్బ
అమెరికా విధానాల్లో అనిశ్చితి, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలోనే భారత జీడీపీ వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నట్టు మూడీస్ వెల్లడించింది. ఈ నెలకుగాను తమ ‘అంతర్జాతీయ స్థూల ఆర్థిక ముఖచిత్రం 2025-26’లో భౌగోళిక, రాజకీయ ఒత్తిళ్లు (భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు వంటివి) కూడా వృద్ధిని అడ్డుకుంటున్నట్టు మూడీస్ చెప్పింది. ముఖ్యంగా పాక్తో యుద్ధం ఉంటుందన్న అంచనాల నడుమ మదుపరులు, వ్యాపారుల వ్యయాలు పెరిగే వీలున్నదంటూ హెచ్చరించింది. ఇదే జరిగితే దేశ జీడీపీ వృద్ధి మరింత పతనం కావచ్చన్న హెచ్చరికలున్నాయి. ఇక వచ్చే ఏడాదికి (2026)గాను భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాను ఇప్పటికైతే యథాతథంగా 6.5 శాతంగానే మూడీస్ ఉంచింది.
మున్ముందూ వడ్డీరేట్ల కోతలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను ఇంకా తగ్గించే అవకాశాలున్నాయని, ఇది దేశ జీడీపీ వృద్ధిరేటు పెరుగుదలకు దోహదపడగలదని మూడీస్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇదిలావుంటే ఈ ఏడాది అమెరికా జీడీపీ అంచనాను 2 శాతం నుంచి 1 శాతానికి, వచ్చే ఏడాదికిగాను 1.8 శాతం నుంచి 1.5 శాతానికి పరిమితం చేసింది. అలాగే చైనా వృద్ధిరేటు ఈ ఏడాది 3.8 శాతంగా, వచ్చే ఏడాదికి 3.9 శాతంగా అంచనా వేసింది.