హైదరాబాద్, నవంబర్ 16 : రామోజీ గ్రూపు తాజాగా మిల్లెట్ల విభాగంలోకి అడుగుపెట్టింది. సబల పేరుతో వీటిని విక్రయించనున్నది. ఈ సందర్భంగా సబల మిల్లెట్ల డైరెక్టర్ సహరి చెరుకూరి మాట్లాడుతూ.. ప్రస్తుతం 45 ఉత్పత్తులను విడుదల చేసినట్లు, వచ్చే మూడు నెలల్లో మరో 55 ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రియ బ్రాండ్‌తో వీటిని ప్రత్యేకంగా విక్రయిస్తున్నట్లు, కస్టమర్లకు నాణ్యమైన మిల్లెట్లను అందించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు, ముఖ్యంగా స్థానికంగా ఉండే రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను కొనుగోలుదారులకు అందిస్తున్నట్లు చెప్పా రు. వీటిలో రెడీ-టు-ఈట్ స్నాక్స్, చిరుధాన్యాలతో బ్రేక్‌ఫాస్ట్, ఇన్స్టంట్ మిక్స్ ఉత్పత్తులున్నాయని, ఇవి రూ.75 మొదలుకొని రూ.150 లోపు లభించనున్నాయి. ప్రస్తుతానికి కంపెనీ వెబ్సైట్, ఈ-కామర్స్‌లో మాత్రమే లభించనుండగా, భవిష్యత్తులో రిటైల్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె ప్రకటించారు. వీటిని విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుండగా, హైదరాబాద్‌లో ఆర్అండ్డీని నెలకొల్పినట్లు చెప్పారు.