గురువారం 04 జూన్ 2020
Business - May 10, 2020 , 00:26:59

ఆరు బ్యాంకులకు కుచ్చుటోపీ

ఆరు బ్యాంకులకు కుచ్చుటోపీ

  • రామ్‌దేవ్‌ ఇంటర్నేషనల్‌ పాట రూ.411 కోట్లు
  • విదేశాలకు పారిపోయిన కంపెనీ ప్రమోటర్లు
  • ఆలస్యంగా మేల్కొని సీబీఐని ఆశ్రయించిన ఎస్బీఐ

న్యూఢిల్లీ, మే 9: దేశంలో ఆర్థిక నేరాలు నానాటికీ పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా రామ్‌దేవ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రమోటర్లు ఆరు బ్యాంకుల కన్సార్టియంను రూ.411 కోట్లకు మోసగించిన వైనం వెలుగులోకి వచ్చింది. విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ లాంటి బడా ఆర్థిక న  నేరగాళ్ల మాదిరిగా వీరు కూడా విదేశాలకు పారిపోవడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఫిర్యాదు చేసింది. దీంతో రామ్‌దేవ్‌ ఇంటర్నేషనల్‌తోపాటు ఆ కంపెనీ డైరెక్టర్లు నరేశ్‌కుమార్‌, సురేశ్‌కుమార్‌, సంగీతపై సీబీఐ ఇటీవల కేసు నమోదుచేసినట్టు శనివారం అధికారులు వెల్లడించారు. ఈ ప్రబుద్ధుల నిర్వాకంతో ఒక్క ఎస్బీఐకే రూ.173 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది. రామ్‌దేవ్‌ ఇంటర్నేషనల్‌కు రుణాలిచ్చిన కన్సార్టియంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఉన్నాయి. లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఇప్పటివరకు సీబీఐ ఈ కేసులో ఎలాంటి సోదాలు నిర్వహించలేదు.

నాలుగేండ్ల క్రితమే ఎన్‌పీఏగా గుర్తింపు

రామ్‌దేవ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ చెల్లించాల్సిన రుణ బకాయిలను వాస్తవానికి నాలుగేండ్ల క్రితమే (2016 జనవరి 27న) నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా గుర్తించినట్టు ఎస్బీఐ ఫిర్యాదును బట్టి స్పష్టమవుతున్నది. ఇది జరిగిన కొద్ది నెలల తర్వాత సదరు రుణగ్రహీతలు దేశం నుంచి పరారయ్యారని తేలడంతో ఈ వ్యవహారంపై ఎస్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఫిర్యాదు చేసింది. 


logo