హైదరాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రఫేల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూజ్‌లేజ్(విమానం బాడీకి సంబంధించిన ప్రధాన విడిభాగం)లు హైదరాబాద్‌లో తయారు కానున్నాయి. ఫ్యూజ్‌లేజ్‌ల ఉత్పత్తికి సంబంధించి రఫేల్ మాతృ సంస్థ డస్సాల్ట్(డసో) ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్ఎల్)లు ఇందుకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఇది దేశీయ ఏరోస్పేస్ తయారీ సామర్ధ్యాలను బలోపేతం చేయడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేయడానికి ఈ ఒప్పందం మరో ముందడుగు కానున్నది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి ఫ్యూజ్‌లేజ్ 2028 నాటికి సిద్ధమవుతుందని, ఈ యూనిట్లో నెలకు రెండు ఫ్యూజ్‌లేజ్‌లు తయారుకానున్నాయి. వీటి తయారీ కోసం హైదరాబాద్‌లో టీఏఎస్ఎల్ ఓ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
టీఏఎస్ఎల్ 2007 నుంచి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగ ఉత్పత్తులను తయా రు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ హయాంలో 2018లో ఆదిభట్లలో ప్రత్యేక అధునాతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి తమ కార్యకలాపాలను భారీగా విస్తరించింది. సికోర్సీ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో సికోర్సీ ఎస్-92 హెలీకాప్టర్ల క్యాబిన్లను ఇక్కడ తయారు చేస్తున్నారు. అలాగే, లాక్‌హీడ్ మార్టిన్, ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, బోయింగ్ తదితర కంపెనీల భాగస్వామ్యంతో అనేక విమాన విడిభాగాలను ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి.
బోయింగ్ భాగస్వామ్యంతో అపాచీ హెలీకాప్టర్ల కోసం ఫ్యూజ్‌లేజ్‌లను తయారు చేస్తున్నారు. జీఈ ఏరోస్పేస్ మరియు సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్, సీఎఫ్ఎం ఎంటర్నేషనల్ జాయింట్ వెంచర్ కోసం విమానాల ఇంజిన్ భాగాలను తయారుచేస్తున్నారు. మొరాకోసహా పలు ఆఫ్రికన్ దేశాలకు రక్షణ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు టీఏఎస్ఎల్ ఒప్పందాలు చేసుకున్నది.
‘మొదటిసారిగా, రఫేల్ ఫ్యూజ్‌లేజ్ లు ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి కానుండటం ఇదే తొలిసారి. భారత్‌లో మా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఇది నిర్ణయాత్మక దశ. దేశీయ ఏరోస్పేస్ పరిశ్రమలోని ప్రధాన కంపెనీల్లో ఒకటైన టీఏఎస్ఎల్సహా మా స్థానిక భాగస్వాముల విస్తరణకు ధన్యవాదాలు. నాణ్యమైన సేవలకు, సైనిక అవసరాలు తీర్చేందుకు దోహదపడుతుంది.
– ఎరిక్ ట్రాఫియర్, డస్సాల్ట్ ఏవియేషన్ సీఈవో
దేశీయ ఏరోస్పేస్ ప్రయాణంలో ఈ భాగస్వామ్యం అత్యంత కీలకమైనది. రఫేల్ ఫ్యూజ్‌లేజ్ ఉత్పత్తి టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సామర్థ్యాలపై పెరుగుతున్న నమ్మకానికి, మాపట్ల డస్సాల్ట్ ఏవియేషన్‌కు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచ వేదికలకు మద్దతు ఇవ్వగల ఆధునిక, బలమైన ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థను స్థాపించడంలో దేశం సాధించిన అద్భుతమైన పురోగతిని కూడా ఇది ప్రతిబింబిస్తుంది.
– సుకరణ్ సింగ్, టీఏఎస్ఎల్ సీఈవో