Uday Kotak | క్విక్ కామర్స్ ప్రభావం పెరిగిపోవడంపై ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్ ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ రిటైల్ స్టోర్లకు ‘క్విక్ కామర్స్’ బిజినెస్ నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. శరవేగంగా పెరుగుతున్న బ్లింకింట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్లాట్ ఫామ్స్ .. భారత రిటైల్ వ్యాపారానికి విఘాతం కలిగిస్తున్నాయని చెప్పారు. ఇది రాజకీయ సమస్యగా పరిణమించే అవకాశం ఉందని ఉదయ్ కోటక్ హెచ్చరించారు.
ఓ ఆంగ్ల టీవీ చానెల్ నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడుతూ.. ‘స్థానిక రిటైల్ దుకాణాలకు క్విక్ కామర్స్ ఒక సవాల్ గా మారుతుంది. ఈ సవాల్ రాజకీయ సమస్యగా పరిణమించే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు. ఐపీఓ ద్వారా స్విగ్గీ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏడు శాతం ప్రీమియంతో లిస్టయిన నేపథ్యంలో ఉదయ్ కోటక్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా భారత్ లో క్విక్ కామర్స్ బిజినెస్ విజయవంతమైందన్నారు. ఈ ఏడాది క్విక్ కామర్స్ బిజినెస్ 6.1 బిలియన్ డాలర్లకు.. వచ్చే ఆరేండ్లలో 40 బిలియన్ డాలర్లకు చేరుతుందని దాటుమ్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.