Hero Moto Corps | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ జూన్ త్రైమాసికం నికర లాభాల్లో అదరగొట్టింది. 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 71 శాతం నికర లాభాలు సాధించింది. గతేడాది కరోనా రెండో వేవ్ ఉధృతి వల్ల విక్రయాలు పెద్దగా జరుగలేదు. కానీ, ఈ ఏడాది బైక్స్ విక్రయాలు భారీగా పెరిగాయి. స్ప్లెండర్, గ్లామర్ బైక్స్ సేల్స్ పెరగడంతో సంస్థ నికర లాభం రూ.365.44 కోట్ల నుంచి రూ.625 కోట్లకు పెరిగింది. కానీ, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.627 కోట్ల నికర లాభం నమోదు కావడం గమనార్హం.
ఆపరేషన్స్ ద్వారా హీరో మోటో కార్ప్స్ ఆదాయాన్ని రూ.5,487.07 కోట్ల నుంచి రూ.83,932.54 కోట్లకు పెరిగింది. సాధారణ వర్షపాతం వంటి అంశాలతో టూ వీలర్స్‌కు మంచి గిరాకీ ఉంటుందని హీరో మోటో కార్ప్స్ అంచనా వేస్తున్నది. భారత్‌లో ఎంట్రీ లెవెల్ టూ వీలర్స్ సేల్స్ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఖర్చులు ఎక్కువ కావడంతో బైక్‌లు, స్కూటర్ల ధరలు తరుచుగా పెంచాల్సి వస్తున్నదని హీరో మోటో కార్ప్స్ తెలిపింది.