హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ..తెలంగాణలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే సంగారెడ్డి వద్ద ప్లాంట్ ఉండగా, కొత్తగా జహీరాబాద్ నిమ్జ్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో మరో ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పబోతున్నట్లు కంపెనీ ఫౌండర్, ఎండీ నిశాంత్ డొంగ్రీ తెలిపారు. 40 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోతున్న ఈ యూనిట్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. నెలకు 12 వేల నుంచి 15 వేల యూనిట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో కొత్తగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న సంగారెడ్డి ప్లాంట్‌తో 500 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. కంపెనీకి చెందిన వాహనాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ నూతన ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం దేశీయంగా 70 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, వచ్చే రెండున్నరేండ్లలో మరో 250 డీలర్‌షిప్‌లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు, స్కూటర్, మోటార్సైకిళ్లలోనూ కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.