EPFO | మీరు ఏదైనా ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారా.. ఆ సంస్థ ద్వారా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సబ్‌స్క్రైబ్ అయ్యారా… అయితే, మీ పరోక్షంలో మీ పీఎఫ్ ఖాతా నుంచి మనీ తీసుకోవాలనుకుంటే.. మీ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్ తప్పనిసరి చేసింది కేంద్రం. కానీ సంస్థ సబ్స్క్రైబర్లు మాత్రం తమ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్లో బోలెడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్‌వో వెబ్సైట్ గంటల కొద్దీ పని చేయడం లేదు. ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ అయినా.. కనెక్షన్ ప్రాబ్లం అని మెసేజ్ రావడంతో ఈపీఎఫ్‌వో సబ్స్క్రైబర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను అందరికీ అందుబాటులోకి తేవడానికి ఈపీఎఫ్‌వో సబ్స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు తమ ఉద్యోగులను సాధ్యమైనంత త్వరగా ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఒకవేళ ఈపీఎఫ్‌వోలో సభ్యులుగా ఉన్నవారికి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే.. వారి పరోక్షంలో పీఎఫ్ మనీ తీసుకోవడానికి ఈ-నామినేషన్ తప్పనిసరి. ఈపీఎఫ్‌వో సబ్స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యుల్లో ఎవరిని ఈ-నామినేట్ చేయాలో ముందుగా నిర్ణయించుకోవాలి.
ఈపీఎఫ్‌వోలో ఈ-నామినేషన్ గడువు ఇంతకుముందు గతేడాది డిసెంబర్ వరకు ఉంది. కానీ ఈపీఎఫ్‌వో వెబ్సైట్లో మాత్రం ఈ-నామినేషన్‌కు గడువేమీ లేదని, సబ్స్క్రైబర్లు తమకు కావాలనుకున్నప్పుడు ఈ-నామినేషన్ చేసుకోవచ్చునని తెలిపింది. ముందుగా మీరు నామినీని చేర్చాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
వారం రోజులుగా ఉద్యోగులు, కార్మికులపై సంస్థల యాజమాన్యాలు ఈపీఎఫ్‌వోలో ఈ-నామినేషన్ పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఫలితంగా చాలా మంది వెబ్సైట్లోకి వెళుతున్నారు.. కానీ అది ఓపెన్ కావడం లేదు.. వెబ్సైట్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై ఈపీఎఫ్‌వో రియాక్టయింది. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపింది.