కోల్‌కతా, మార్చి 10: ప్రభుత్వం మెజారిటీ వాటాను విక్రయించదల్చిన పలు కంపెనీల ప్రైవేటీకరణ లావాదేవీలు తుదిదశలో ఉన్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్‌కాంత్ పాండే తెలిపారు. మర్చెంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గురువారం నిర్వహించిన ఒక వెబినార్‌లో పాండే మాట్లాడుతూ వాటా విక్రయానికి త్వరలో ఆసక్తి బిడ్స్‌ను పిలుస్తామన్నారు. ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్లను ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా ప్రైవేటీకరించిందన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), భారత్ ఎర్త్ మూవర్స్ (బీఈఎంఎల్), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)లతో పాటు సెయిల్‌కు చెందిన కొన్ని యూనిట్లు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)కు చెందిన స్టీల్ ప్లాంట్ విక్రయం కోసం ఆసక్తి బిడ్స్ ఆహ్వానించడానికి తమ శాఖ సిద్ధంగా ఉన్నదన్నారు. మూడు కీలక కంపెనీలు రైల్ టెల్, ఐఆర్ఎఫ్సీ, మాజగాన్ డాక్‌లను గతేడాది ఎక్సేంజీల్లో లిస్ట్ చేశామన్నారు.
మార్కెట్ పరిస్థితులు గమనిస్తున్నాం
ఎల్ఐసీ మెగా ఐపీవో జారీ చేసేందుకు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్ని గమనిస్తున్నామని తుహిన్ పాండే తెలిపారు. ఈ ఐపీవో భారత మార్కెట్‌కు గొప్ప అవకాశమని, త్వరలోనే ఆఫర్ జారీచేయగలమన్న ఆశాభావంతో ఉన్నామన్నారు.