హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా 5వేల సూక్ష్మ, చిన్నతరహా ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును రాష్ట్ర పరిశ్రమల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. రూ.50 లక్షలదాకా పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేస్తే రూ.10 లక్షలకు మించకుండా 35% సబ్సిడీ ఇస్తారు. రుణం, మార్కెటింగ్ సౌకర్యాలనూ కల్పిస్తారు.
పీఎం ఫామ్లైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ (పీఎం ఎఫ్ఎంఈ) కింద రూ.240 కోట్లతో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్నతరహా ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తొలుత సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ కింద ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే పురోగతి లేక ప్రభుత్వం పరిశ్రమల శాఖకు బాధ్యతలు అప్పగించింది. దీంతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, పరిశ్రమల శాఖ అధికారులు, బ్యాంకర్లతో తాజాగా సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా 5వేల సూక్ష్మ, చిన్నతరహా ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
ఆహారశుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించడం.. గ్రామీణ యువతకు కలిసి రానున్నది. గ్రామాల్లో పరిశ్రమల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటు కోసం 1,460 దరఖాస్తులు రావడం గమనార్హం.