హైదరాబాద్, నవంబర్ 27 : ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పిరమల్ ఫైనాన్స్..నూతన వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నది. ప్రస్తుతం గృహ, వ్యక్తిగత, ఎంఎస్ఎంఈ, యూజ్డ్ కార్లపై రుణాలు ఇస్తున్న సంస్థ..త్వరలో బంగారం రుణాల విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు కంపెనీ సీఈవో జగ్దీప్ మల్లారెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి రిజర్వుబ్యాంక్ నుంచి అనుమతులు వచ్చాయని, త్వరలో ఈ సేవలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే నాలుగు నుంచి ఐదేండ్లకాలంలో కొత్తగా 50 నుంచి 75 శాఖలను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
వీటిలో తెలంగాణకు పెద్దపీట వేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ల్లో 59 శాఖలను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం కంపెనీ ఏయూఎం రూ.75 వేల కోట్ల స్థాయిలో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి లక్ష కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నారు. అలాగే 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1.50 లక్షల కోట్లకు చేరుకుంటున్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.