SEBI Chairperson | ఇటీవల కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తున్న స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్‌కు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు తమ ముందు హాజరు కావాలని పేర్కొంది. సెబీ చైర్ పర్సన్ తోపాటు టెలికం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీకి సమన్లు జారీ చేసింది. కేంద్ర ఆర్థికశాఖలోని ఎకనమిక్ ఎఫైర్స్ విభాగం, టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఉన్నతాధికారులను విచారణకు హాజరు కావాలని పీఏసీ ఆదేశించింది.
అయితే సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్, ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ ప్రతినిధులు మాత్రమే పీఏసీ ముందు విచారణకు హాజరవుతారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ కమిటీలు సమన్లు జారీ చేసినప్పుడు నియంత్రణ సంస్థల అధిపతులు హాజరు కావాలని పార్లమెంటరీ వ్యవహారాల్లో సంప్రదాయం గురించి పేర్కొనలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అదానీ గ్రూపుతో మాధాబీ పురీ బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్‌లకు గల అనుబంధంపై యూఎస్ షార్ట్ సెల్లర్ కం రీసెర్చ్ కంపెనీ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై సెమీ చైర్ పర్సన్‌ను విచారణకు రావాలని పీఏసీ ఆదేశించినట్లు తెలుస్తున్నది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకవతవకల్లో భాగస్వామిగా ఉన్న ఆఫ్ షోర్ కంపెనీల్లో మాధాబీ పురీ బుచ్ దంపతులకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ ఆరోపణ. ఈ విషయమై అదానీ గ్రూపుపై ఆరోపణలు వచ్చిన తర్వాత 18 నెలలకు కూడా ఆ గ్రూప్ సంస్థలపై వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో సెబీ నిరాసక్తతను ఇది తెలియజేస్తున్నదని హిండెన్ బర్గ్ పేర్కొంది.