Airfare | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : విమాన చార్జీలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. పహెల్గాంపై తీవ్రవాదులు దాడుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో పాకిస్థాన్ ఒక అడుగుముందుకేసి ఆ దేశ గగనతలాన్ని మూసివేసింది. దీంతో పాకిస్థాన్ గగనతలం నుంచి దేశీయ విమాన సర్వీసులు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో చుట్టూ తిరిగి ప్రయాణించడంతో ఆయా విమానయాన సంస్థలు ప్రయాణికులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. పాక్ గగనతలం నుంచి వెళ్లే యూరప్, ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యం వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల విమాన చార్జీలు 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతిగా పాకిస్థాన్ తన గగనతలంపై నిషేధం విధించడంతోపాటు సరిహద్దును మూసివేసింది.
భారత్ నుంచి ఉత్తర అమెరికా, బ్రిటన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల సమయం మరింత పెరగనున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేశాయి. పాక్ గగనతలం మూసివేయడంతో అమెరికా, యూరోపియన్ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణ సమయం 2 గంటల నుంచి 2.5 గంటల వరకు పెరగనున్నదని సీనియర్ పైలెట్ ఒకరు చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులపై ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. ప్రయాణ సమయం పెరగడంతో విమాన సంస్థలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా టికెట్ చార్జీలను పెంచడానికి సమాయత్తమవుతున్నాయి. గగనతలం మూసివేయడంతో చమురు వినిమయం పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికం కావడం కూడా ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.
పాక్ గగనతలం మూసివేయడంతో ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమాన సర్వీసులను దారి మళ్లించింది. ఉత్తర అమెరికా, బ్రిటన్, యూరప్, ఇతర దేశాలకు ప్రయాణించే అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసులు కొత్త రూట్లో వెళ్తున్నాయి. దీంతో వీటి ప్రయాణం సమయం మరో రెండు గంటలు పెరుగుతున్నదని తెలిపింది. మరో విమానయాన దిగ్గజం ఇండిగో..అంతర్జాతీయ రూట్లలో నడిచే విమాన సర్వీసులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని, ప్రయాణికులకు తమ పరిస్థితిని వివరించనున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు కలిగించే అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకోగలం..మీ గమ్యాన్ని చేర్చడానికి తమవంతుగా కృషి చేయనున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది. ఈ రెండు సంస్థలతోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలకు చెందిన సర్వీసులు కూడా ఈ రూట్లో నడుస్తున్నాయి.