Paytm-RBI | ఇప్పటి వరకు ఫిన్ టెక్ రంగంలో సంచలనాలు నమోదు చేసిన పేటీఎం అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో యూజర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీంతో యూజర్లు పేటీఎం స్థానే ఇతర పేమెంట్స్ యాప్స్ వైపు మొగ్గుతున్నారు. నాలుగు రోజుల్లోనే ఫోన్ పే (PhonePe), భీమ్-యూపీఐ (BHIM-UPI), గూగుల్ పే (Google Pay) యాప్‌లను గణనీయంగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఈ నెల మూడో తేదీ నాడే 2.79 లక్షల యూజర్లు ‘ఫోన్‌పే’ డౌన్ లోడ్ చేసుకున్నట్లు ‘యాప్ ఫిగర్స్ (App Figures)’ తెలిపింది. గత వారంతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ అని పేర్కొంది. గత నెల 31 నుంచి ఈ నెల మూడో తేదీ వరకూ మొత్తం 10.4 లక్షల మంది యూజర్లు ఇతర మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారని యాప్ ఫిగర్స్ తన నివేదికలో వెల్లడించింది.
ఇదిలా ఉంటే కొంత కాలంగా కస్టమర్లు, వ్యాపారులను ఆకర్షించడానికి ఫోన్ పే (PhonePe) కొత్త విధానాలు అమలు చేస్తున్నది. తద్వారా గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store)లో ఉచిత యాప్ ల జాబితాలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గత నెలాఖరు నాటికి గూగుల్ ప్లే స్టోర్‌లో ‘ఫోన్ పే బిజినెస్’ యాప్ 188వ స్థానంలో ఉంటే ఈ నెల ఐదో తేదీకల్లా 33వ స్థానానికి చేరింది. ఇక యాప్ స్టోర్‌లో 227 నుంచి 72 ర్యాంక్ కి చేరుకున్నది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుబంధ భీమ్ -యూపీఐ యాప్ డౌన్ లోడ్లు కూడా 50 శాతం పెరిగాయి. గత నెల 19న 326వ స్థానంలో ఉన్న భీమ్-యూపీఐ యాప్.. ఈ నెల ఐదోతేదీకల్లా ఏడో స్థానానికి దూసుకొచ్చింది. ఇక గూగుల్ పే యాప్ జనవరి 31-ఫిబ్రవరి మూడు మధ్య ప్లే స్టోర్‌లో 3.95 లక్షల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.