హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోతున్నది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో అనేక ఈ-కామర్స్ సంస్థలు, దుకాణదారులు వివిధ రకాల వస్తూత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటి ముందుకు చేర్చుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడీ ట్రెండ్ గ్రామాలకూ చేరింది. ఇక తెలంగాణ ప్రజలైతే పెద్ద ఎత్తునే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ తాజా సర్వేలో తేలింది.
కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి-మార్చికిగాను కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే: టెలికాం, 2025 పేరుతో ఓ అధ్యయనం చేపట్టింది. ఇటీవలే విడుదలైన ఈ సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఓవరాల్గా దేశంలోని కుటుంబాల్లో సగటున 24.5 శాతం ఆన్లైన్లోనే కొంటున్నట్లు స్పష్టమైంది. అయితే రాష్ర్టాలవారీగా చూస్తే.. అత్యధికంగా తెలంగాణలో ఆన్లైన్ షాపింగ్ చేసే కుటుంబాలు 35.1 శాతంగా ఉంటే, అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్లో 23.4 శాతంగా ఉన్నాయి. నగరాలవారీగా చూస్తే మాత్రం.. చంఢీగఢ్, గోవా, దాద్రా-నగర్ హవేలి టాప్లో నిలిచాయి.
తెలంగాణలోని నగర, పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ కొనుగోలుదారులు 56.6 శాతంగా ఉన్నారు. గ్రామాల్లో 16 శాతంగా ఉన్నారు. బీహార్లో ఈ గణాంకాలు వరుసగా 40.1 శాతం, 24.8 శాతంగా ఉన్నాయి. అలాగే ఏపీలో 35 శాతం, 16.6 శాతంగా నమోదయ్యాయి. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా జరుగుతున్న కొనుగోళ్లలో ఆహారేతర వస్తూత్పత్తులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ జనవరి-మార్చిలోనూ 53.3 శాతంగా నమోదయ్యాయి. ఆహార పదార్థాల కొనుగోళ్లు 7.6 శాతంగానే ఉన్నాయి.