హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఒలంపస్ కార్పొరేషన్..హైదరాబాద్‌లో పరిశోధన-అభివృద్ధి(ఆర్అండ్డీ) ఆఫ్‌షోర్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆధునిక వైద్య పరికరాల అభివృద్ధి ఈ సెంటర్ దోహదం చేయనున్నదని, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీతో కలిసి ఈ సెంటర్‌ను నెలకొల్పబోతున్నది. రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశంతో అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ఒలంపస్ కార్పొరేషన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నవీన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్అండ్డీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..మెడికల్ విభాగంలో ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఒలంపస్ కార్పొరేషన్ తమ నాలుగో ఆర్అండ్డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకురావడం శుభసూచికమని, మెడికల్ టెక్నాలజీ రంగం లో ఇదొక మైలురాయి వంటిదని పేర్కొన్నా రు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక ప్రాంతంగా ఉండడమే కాకుండా హెల్త్‌కేర్ రంగంలో అనేక అగ్రగామి సంస్థలు, ప్రతిభావంతులైన నిపుణులు కలిగివుండటం మెడ్‌టెక్ రంగంలో ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సంస్థకు ఇప్పటికే జపాన్, అమెరికా, యూరప్‌లలో పరిశోధన కేంద్రాలున్నాయి.