Ola Electric Motorbike | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ కీలక నిర్ణయం ప్రకటించింది. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఓలా ఐపీఓ ప్రకటనపై బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో కలిసి జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ సంగతి చెప్పారు. 2025 తొలి ఆరు నెలల్లో తొలి మోటార్ సైకిల్ మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఆగస్టు 15న జరిగే ఈవెంట్లో మోటారు సైకిళ్ల మోడల్స్, ఇతర వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఎంతో కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్లతోపాటు ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లు, ఎలక్ట్రిక్ కార్లతో వరల్డ్ మొబిలిటీలో కీలక పాత్ర పోషించాలని అభిలషించారు. ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1ఎక్స్ వంటి ఈవీ స్కూటర్లను మార్కెట్లో ఆవిష్కరించారు. కొన్ని సంస్థలు మాత్రమే మార్కెట్లో ఉన్న నేపథ్యంలో లుక్రేటివ్ ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల స్పేస్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
తాము సొంతంగా తయారు చేసే ఈవీ బ్యాటరీల సాయంతో ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లను అభివృద్ధి చేస్తామని భవిష్ అగర్వాల్ సోమవారం మీడియాకు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి తాము తమ సంస్థలో తయారుచేసిన బ్యాటరీలను మాత్రమే ఈవీ స్కూటర్లు, ఈవీ మోటారు సైకిళ్లలో వినియోగిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ను కేంద్రంగా చేయాలన్నదే తమ అభిమతం అని తెలిపారు.